నాటుమందు.. నమ్మితే కాటికే!
పాముకాటుతో ప్రాణాలు కోల్పోతున్న వైనం
ఏడాదిలో 300మందికిపైగా మృత్యువాత
ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు
జిల్లాలో పాముకాటుకు గురై మృత్యువాతపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది కాలంలో 300మందికిపైగా ఇలా మృతి చెందారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. కూలీ చేసుకుని జీవించే నిరుపేదలతో పాటు పంట పొలాల దగ్గరకు కాపలాకోసం వెళుతున్న రైతన్నలు ఎక్కువగా బలవుతున్నారు.. పాముకాటుకు గురయినప్పుడు నాటు వైద్యం చేయించుకోరాదని వైద్యులు సూచిస్తున్నారు. – మహబూబ్నగర్ క్రైం
చేను పనికి వెళ్లినప్పుడు పొదల్లో చేతులు పెట్టడం, అందులోంచి కాలినడకన వెళ్లడం చేస్తుండటంతో తరచూ పాముకాటుకు గురవుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పాముల్లో వివిధ రకాలుంటాయి. అందులో విషసర్పాలు కొన్నే ఉంటాయి. నాగుపాము, కట్ల, రక్తపింజరం వంటి కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదకరం. ఇవి కాటేసిన వెంటనే శరీరంలోకి విషం వెళ్లి శ్వాసకోశాలు, మూత్రపిండాలపై ప్రభావం పడి ప్రాణానికి అపాయం ఏర్పడుతుంది. విషసర్పాలు కానివి కాటేస్తే ప్రాథమిక చికిత్స సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జూలైలో 18, ఆగస్టులో 23వ తేదీ వరకు 14మంది పాముకాటుకు బలయ్యారు.
ఇటీవల జిల్లాలో కొన్ని పాముకాటు మరణాలు..
ఆగస్టు 3న ధరూర్ మండలంలోని మాల్దొడ్డికి చెందిన చంద్రిక (4) ఇంట్లో నిద్రపోతుండగా పాటుకాటు వేయడంతో మృతి చెందింది.
4న మిడ్జిల్ మండలంలోని కొత్తూర్కు చెందిన శివకుమార్ (11) పాముకాటుతో మృతి చెందాడు.
6న కేశంపేట మండలం నిర్దవెల్లికి చెందిన గిద్దెల చిన్నకేశవులు (26) పాముకాటు వల్ల మృత్యువాతపడ్డాడు.
17వ తేదీ రాత్రి ధన్వాడ మండలం మాధ్వార్కు చెందిన ఆంజనేయచారి (35) పాముకాటుకు గురై మృత్యువాతపడ్డాడు. ఇదేరోజు తలకొండపల్లికి చెందిన అనిత (18) పాముకాటుతో‡మృతి చెందింది.
కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దారెడ్డిచెరువుతండాకు చెందిన బాల్యనాయక్ (45) శివారులోని పొలంలో పశువులు మేపుతుండగా గడ్డిలో ఉన్న పాముకాటుకు బలయ్యింది.
18వ తేదీ రాత్రి ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లికి చెందిన సరోజ(35) ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురై చనిపోయింది.
ఇటీవల వెల్దండలో పదేళ్ల బాలుడు చెట్ల పొదల్లో బంతికోసం వెతకగా పాము కాటేయడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ప్రభుత్వ వైద్యులకు శిక్షణ అవసరం
పాము కాటేస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విషవిరుగుడు మందు (యాంటీ స్నేక్ వీనమ్)లు అందుబాటులో ఉన్నా అత్యధికచోట్ల మరణాలే సంభవిస్తున్నాయి. చికిత్స విధానంలో వైద్యులు సరైన పద్ధతి పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. మామూలుగా సర్పం కాటేసినా విరుగుడు చికిత్స అందిస్తుండటంతో అదీ ప్రాణాల మీదకొస్తుందనే వాదనలున్నాయి. అందుకనే దీనిపై వైద్యులకు శిక్షణ ఇవ్వాలి. విషసర్పాలు కాటేస్తే పరిస్థితి చెయ్యిదాటిన సమయంలో రోగికి వెంటిలేటర్లు అవసరం.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
పాము కాటేసిన వెంటనే విషం మనిషి శరీరంలోకి వెళ్లకుండా తాడుతో లేక ఇతర గుడ్డముక్కలతోనైనా కాటేసిన చోట పైన కట్టాలి. ఆ వెంటనే చికిత్సకు తరలించాలి.
మూఢనమ్మకాలను నమ్మి మంత్రం వేసిన నీళ్లు తాగడమో, భూమిలో కాలుపెట్టి చికిత్స తీసుకోవడమే చాలాచోట్ల చేస్తుంటారు. వీటికి దూరం ఉండి తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
పాము కాటేసిన వెంటనే చాలామంది భయంతోనే ప్రాణాలను మీదకి తెచ్చుకుంటున్నారు. భయపడొద్దని చికిత్స ఉంటుందని నిర్భయంగానే ఆస్పత్రికి బాధితులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
చేనులోకి వెళ్లిన సమయంలో చెట్లపొదల్లో అడుగు పెట్టేది ఉంటే కాళ్లకు పెద్ద సైజులో ఉండేలా నల్లని బూట్లు ధరించాలి.
పొలం పొదల్లో పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించాలి.
పిల్లలను పొదలు ఎక్కువగా ఉన్నచోట ఆడుకోవడానికి పంపించరాదు.
పల్లెల్లో ఇళ్ల పరిసరాలు చుట్టూ చెట్లపొదలు ఎక్కువగా ఉండనివ్వకుండా చూసుకోవాలి.
ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చాలా వరకు పాములు బయటకొచ్చే అవకాశాలుంటాయి. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
పాము కరిచిన పై భాగాన తాడుతో గాని, గుడ్డతో కానీ గట్టిగా కట్టు కట్టాలి. కాటువేసిన ప్రాంతంలో రక్తం బయటకు వెళ్లేలా చిన్నపాటి రంధ్రం వేయాలి. వెంటనే పరిగెత్తకుండా అలాగే కూర్చోవాలి.
ఆర్ఎంపీల వద్దకు వెళ్లొద్దు
జిల్లాలో పాముకాటు వేసిన తర్వాత ఎక్కువ శాతం మంది నాటువైద్యులు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా మంది భయం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు వచ్చేందుకు ఆలస్యం చేస్తుంటారు. అన్ని పీహెచ్సీల్లో యాంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంది. ఇప్పటికే దీనిపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం.
– డాక్టర్ నాగారాం, డీఎంహెచ్ఓ, మహబూబ్నగర్