ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు గడువు పెంపు
చిత్తూరు (కలెక్టరేట్): చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదును డిసెంబరు 8వ తేది వరకు ఎన్నికల సంఘం గడువును పొడిగించినట్లు నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి, డీఆర్వో విజయ్‌చందర్ తెలిపారు. బుధవారం స్థానిక డీఆర్వో కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో పట్టభద్రులు 73,332 మంది దరఖాస్తులు అందాయని, వాటిని పరిశీలించిన అనంతరం సక్రమంగా లేని 10,084 దరఖాస్తులు తిరస్కరించగా, నికరంగా 63,248 నమోదయ్యాయన్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించి 8,788 మంది దరఖాస్తు చేసుకోగా అందులో సక్రమంగాలేని 1,459 దరఖాస్తులు తిరస్కరించగా, 7,329 దరఖాస్తులు ఓటర్లుగా నమోదు చేశారన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పట్టభద్రుల ఓటర్లుగా 72,375 మందిని, ఉపాధ్యాయ ఓటర్లుగా 5,252 మందిని, నెల్లూరు జిల్లాలో పట్టభద్రుల ఓటర్లుగా 63,477 మందిని, ఉపాధ్యాయ ఓటర్లుగా 4,407 మందిని నమోదు చేసినట్లు ఆయన వివరించారు. గురువారం నుంచి డిసెంబరు 8వరకు ఈ జాబితాపై ఆక్షేపణలు, ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. జాబితాలో మృతులు, బోగస్, వలసపోరుునవారు సమాచారం ఇస్తే వాటిని తొలగిస్తామన్నారు. అర్హతవుండి ఓటర్లుగా నమోదు చేసుకోని వారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుత జాబితాలో లేని వారు తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు చేసుకున్న జాబితాలను పరిశీలించి డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు.