droplet
-
ఒక్క దగ్గు తుంపర = 6.6 మీ. దూరం
సాక్షి, హైదరాబాద్: ఒక దగ్గు తుంపర లేదా సూక్ష్మకణం ప్రయాణించే దూరమెంతో తెలుసా?.. 6.6 మీటర్లు. అదే పొడి వాతావరణంలోనైతే మరింత దూరం ప్రయాణిస్తుందట. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అధ్యయనం ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. కోవిడ్ నేపథ్యంలో వ్యక్తుల మధ్య దూరం పాటించడం ఎంత ముఖ్యమో ఈ పరిశోధన తెలియచెబుతోంది. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, తగ్గినపుడు, తుమ్మినపుడు సూక్ష్మరూపంలో వైరస్ కణాలు వెలువడి.. మీటరు దూరంలో ఉండే వ్యక్తులు వాటి బారినపడే అవకాశాలు ఎక్కువున్నట్టు గతంలోనే అంచనా వేశారు. వివిధ సంస్థలు నిర్వహించిన పరిశీలనల్లో భాగంగా దగ్గు తుంపర్లు (డ్రాప్‌లెట్లు) ఏ దిశలో ఎలా పయనిస్తాయనేది అధ్యయనం చేశారు. వీటికి భిన్నంగా సింగపూర్ ఇన్స్టిట్యూట్ పరిశోధనలో మాత్రం ఒక్క దగ్గు తుంపర (సింగిల్ కాఫ్ డ్రాప్లెట్) సెకనుకు 2 మీటర్ల వాయువేగం ఉన్న పరిస్థితుల్లో 6.6 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని, పొడి వాతావరణంలో మరింత దూరం వెళ్లే అవకాశాలున్నాయని తేల్చింది. కరోనా కణాల వైరల్ ట్రాన్సిమిషన్‌ను మరింతగా అర్థం చేసుకునేందుకు ‘ఫ్లూయిడ్ సైన్సెస్’అంశాలను అధ్యయనంలో భాగంగా చేర్చారు. దగ్గినపుడు వివిధ సైజుల్లో వెయ్యి తుంపర్లు సాధారణంగా ఒక వ్యక్తి దగ్గినపుడు వివిధ పరిమాణాల్లో వెయ్యిదాకా తుంపర్లు వెలువడతాయి. వాటిలో బరువు ఎక్కువగా ఉన్నవి త్వరగా నేలపై పడిపోతాయి. అయితే గాలి వేగం లేకున్నా ఒక మీటర్ వరకైతే ప్రయాణిస్తాయని ఈ పరిశోధకులు వెల్లడించారు. ‘సైజులో మధ్యస్తంగా ఉన్న దగ్గు తుంపర్లు చిన్నచిన్నవిగా విడిపోయి గాలితో పాటు మరింత దూరం ప్రయాణిస్తాయి. అవి ఆవిరైపోయే క్రమంలో ఏరోసోల్స్‌గా మార డం వల్ల ఊపిరి పీల్చినపుడు సులభంగా ఊపిరితిత్తులోకి చేరి శ్వాసతీసుకునే మార్గంలో ప్రవేశిస్తాయి. ఆవిరి కాని తుంపర్ల కంటే ఆవిరై ఏరోసోల్స్‌గా మారే కణాలు లేదా డ్రాప్‌లెట్లతోనే మరింత ప్రమాదం’అని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. వాయు ప్రసారం, వేగంతో పాటు వాతావరణంలోని వివిధ అంశాల ప్రభావం, వివిధ స్థాయిల్లోని గాలి వేగం వల్ల మనుషుల శరీరాల చుట్టూ గాల్లోని దగ్గు తుంపర్లు ఏ మేరకు ప్రయాణిస్తాయనేది ‘మ్యాథమేటికల్ ఫార్ములేషన్స్’తో పరిశీలించారు. దగ్గర్లోని వ్యక్తులకు దగ్గు తుంపర్లు ఎలా చేరుకుంటాయనేది సైతం అధ్యయనం చేశారు. పరిశోధనలో భాగంగా సమశీతోష్ణస్థితి ఉన్న వాతావరణంలో, బహిరంగ ప్రదేశాల్లో గాలిలో ప్రయాణించే దగ్గు తుంపర్లు లేదా కణాలపై దృష్టిపెట్టారు. ఇందులో సాధించిన ఫలితాలు, అంచనాలను ఇండోర్ ప్రదేశాలతో పాటు బహిరంగ ప్రదేశాలు, ఎక్కువ మంది గుమికూడే కాన్ఫరెన్స్ హాల్స్, థియేటర్ల వంటి చోట్ల కూడా తమ పరిశోధనలతో మరింత లోతుగా పోల్చిచూసేందుకు సింగపూర్ ఇన్స్టిట్యూట్ సిద్ధమవుతోంది. -
విద్యార్థి వీరులారా వందనం
సాక్షి, సిటీబ్యూరో: మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు పోరు కెరటాలై కదిలారు. అగ్గి బరాటాలై ఉద్యమాన్ని రగిలించారు. 2009-13 మధ్య కాలంలో ఎందరో విద్యార్థి వీరులు అమరులయ్యారు. మరెందరో ఆత్మబలిదానానికి ఒడిగట్టడంతో కేంద్రం స్పందించింది. అరవైఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. పోరుబాటలో ఆత్మార్పణం.. 2010లో నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌చారి ఎల్బీనగర్ చౌరస్తాలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని కాలిపోతూ చేసిన తెలంగాణా నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే ఏడు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్‌రెడ్డి ఓయూ ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా, కోదాడకు చెందిన వర్సిటీ బీటెక్ విద్యార్థి మీగడ సాయికుమార్ యాదవ్ ఓయూలో తన ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఓయూ జాక్ చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో రంగారెడ్డిజిల్లాకు చెందిన సిరిపురం యాదయ్య ఎన్సీసీ వద్ద తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని కాలి బూడిదైపోయాడు. ఆ తర్వాత జహీరాబాద్‌కు చెందిన ఇశాంత్రెడ్డి ఓయూ లైబ్రరీ ముందు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు పాలైన విద్యార్థి నేతలు వీరే... 2009 నవంబర్ నుంచి 2013 వరకు నగరంలో సుమారు పదివేల మంది విద్యార్థులపై దాదాపు 2000 కేసులు నమోదు అయ్యా యి. ఇందులో ఉస్మానియా, దాని అనుబంధ కాలేజీల్లో చదువుతున్న సుమారు రెండు వేలమంది ఉన్నారు. టీఎస్‌జాక్ చైర్మన్ పిడమర్తి రవి-160, మాజీ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ -152, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్-168, ఓయూ జేఏసీ అధ్యక్షుడు మర్రి అనిల్-109, కొనగాల మహేష్-70, గెల్లు శ్రీనివాస్-77, జెట్టా శంకర్ 40, దూదిమెట్ల బాలరాజు -152, ఆశప్ప - 40, వంగపల్లి శ్రీనివాస్, దరువు ఎల్లన్న, మాందాల భాస్కర్, దుర్గం భాస్కార్, స్టాలిన్, పున్నా కైలాస్నేత, కరాటే రాజు, కడియం రాజు, వీరబాబు, రామకృష్ణ, వరంగల్ రవి, దాత్రిక స్వప్న, సత్య, బాలలక్ష్మి, మణిపై కూడా కేసులు నమోదయ్యాయి.