విద్యార్థి వీరులారా వందనం
సాక్షి, సిటీబ్యూరో: మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు పోరు కెరటాలై కదిలారు. అగ్గి బరాటాలై ఉద్యమాన్ని రగిలించారు. 2009-13 మధ్య కాలంలో ఎందరో విద్యార్థి వీరులు అమరులయ్యారు. మరెందరో ఆత్మబలిదానానికి ఒడిగట్టడంతో కేంద్రం స్పందించింది. అరవైఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది.
పోరుబాటలో ఆత్మార్పణం..
2010లో నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌చారి ఎల్బీనగర్ చౌరస్తాలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని కాలిపోతూ చేసిన తెలంగాణా నినాదాలు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే ఏడు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్‌రెడ్డి ఓయూ ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా, కోదాడకు చెందిన వర్సిటీ బీటెక్ విద్యార్థి మీగడ సాయికుమార్ యాదవ్ ఓయూలో తన ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఓయూ జాక్ చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో రంగారెడ్డిజిల్లాకు చెందిన సిరిపురం యాదయ్య ఎన్‌సీసీ వద్ద తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని కాలి బూడిదైపోయాడు. ఆ తర్వాత జహీరాబాద్‌కు చెందిన ఇశాంత్‌రెడ్డి ఓయూ లైబ్రరీ ముందు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జైలు పాలైన విద్యార్థి నేతలు వీరే...
2009 నవంబర్ నుంచి 2013 వరకు నగరంలో సుమారు పదివేల మంది విద్యార్థులపై దాదాపు 2000 కేసులు నమోదు అయ్యా యి. ఇందులో ఉస్మానియా, దాని అనుబంధ కాలేజీల్లో చదువుతున్న సుమారు రెండు వేలమంది ఉన్నారు. టీఎస్‌జాక్ చైర్మన్ పిడమర్తి రవి-160, మాజీ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ -152, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్-168, ఓయూ జేఏసీ అధ్యక్షుడు మర్రి అనిల్-109, కొనగాల మహేష్-70, గెల్లు శ్రీనివాస్-77, జెట్టా శంకర్ 40, దూదిమెట్ల బాలరాజు -152, ఆశప్ప - 40, వంగపల్లి శ్రీనివాస్, దరువు ఎల్లన్న, మాందాల భాస్కర్, దుర్గం భాస్కార్, స్టాలిన్, పున్నా కైలాస్‌నేత, కరాటే రాజు, కడియం రాజు, వీరబాబు, రామకృష్ణ, వరంగల్ రవి, దాత్రిక స్వప్న, సత్య, బాలలక్ష్మి, మణిపై కూడా కేసులు నమోదయ్యాయి.