ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై జోక్యానికి హైకోర్టు నో!
అభ్యంతరాలుంటే సివిల్ కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేసిన ధర్మాసనం
హైదరాబాద్: ఏబీఎన్ చానల్ ప్రసారాల నిలిపివేత వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ ఇంతకుముందు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులకు రిట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
కేబుల్ ఆపరేటర్లతో ఏమైనా ఇబ్బందులు ఉంటే సివిల్ కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని స్పష్టం చేస్తూ... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ చానల్ యాజమాన్యం అప్పీలును కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలో తమ చానల్ ప్రసారాలను నిలిపివేస్తూ మల్టీసిస్టం ఆపరేటర్లు (కేబుల్ ఆపరేటర్లు-ఎంఎస్‌వోలు) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏబీఎన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.