'ప్రతిరోజూ 10 లక్షల లీటర్ల తాగునీరు ఇస్తాం'
ఢిల్లీ: మహారాష్ట్రలోని కరువు బాధిత ప్రాంతమైన లాతూరు పట్టణానికి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రతిరోజూ 10 లక్షల త్రాగునీటిని రెండు నెలల పాటు సరఫరా చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. అందుకోసం ఢిల్లీవాసులందరూ తాము రోజు వినియోగించే నీటిలో కొంత నీటిని నిల్వ చేయాల్సిందిగా సూచించారు. అలా నిల్వా చేసి.. నీటిని లాతూరు ప్రాంతానికి తమ వంతు సహాయంగా సరఫరా చేయడంలో భాగస్వాములు కావాలని కేజ్రీవాల్ చెప్పారు. అయితే మహారాష్ట్రలోని లాతూరు ప్రజలు భయంకరమైన కరువు తాండవించి నీళ్లు లేక అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే.
భయంకర నీటి ఎద్దడిని నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మహారాష్ట్ర సర్కార్ నడుం బిగించిన విషయం తెలిసిందే. తీవ్ర కరువు, నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మరఠ్వాడలోని లాతూర్కు నీరు అందించేందుకు వాటర్ ట్రయిన్ పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి నిన్న బయల్దేరింది. 50 లక్షల లీటర్ల నీటితో నింపిన వాటర్ ట్రయిన్ మంగళవారం ఉదయం లాతూర్ చేరుకుంది. రైలులో చేరుకున్న నీటిని పైప్ లైన్ల ద్వారా తరలిస్తున్నారు. మహారాష్ట్ర మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి.