బావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
సెలవుల్లో ఆటలాడుకుంటూ దాహం వేడడంతో నీళ్లు తాగేందుకు బావి వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు అందులోపడి మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం వరంగల్ జిల్లా మహాబూబాబాద్ మండలం కేంద్రంలోని గుండ్లకుంట చెరువు వద్ద జరిగింది. గుండ్లకుంట కాలనీకి చెందిన రాగం సాయిలు కుమార్తె అనిత (13), రాగం మల్లయ్య కుమార్తె చందు (11), తొర్రూరుకు చెందిన 11 ఏళ్ల నడిగడ్డ చందు (సాయిలుమేనల్లుడు) మద్యాహ్నం సమయంలో ఆటాడుకుంటూ దాహం వేయడంతో గుండ్లకుంట చెరువు పక్కన ఉన్న బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లారు. నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ముగ్గురూ బావిలో పడి మృతి చెందారు.
ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలోనే బావి సమీపంలో ఉన్న చెప్పులను చూసి చిన్నారులు పడిన ట్లుగా గుర్తించారు. దీంతో బావిలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు చనిపోవడంతో గుండ్లకుంట కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.