నిషా ముక్త్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజలు.. అంతా కలిసి పని చేస్తేనే రాష్ట్రం నుంచి మాదకద్రవ్యాలను తరిమేయడం సాధ్యమవుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. ‘నిషా ముక్త్ తెలంగాణ’(మత్తు రహిత తెలంగాణ) కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు.గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గంజాయి సహా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి, ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి ‘సాక్షి’చేపట్టిన ‘మీతో సాక్షి’క్యాంపెయినింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తమ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా పంపారు. వీటికి సందీప్ శాండిల్య సమాధానాలు ఇచ్చారు. ‘మీతో సాక్షి’కి వచ్చిన ప్రశ్నలకు శాండిల్య సమాధానాలు..ప్రశ్న: మత్తు పదార్థాలకు అలవాటు పడిన పిల్లల్ని ఎలా గుర్తించాలి? డీ అడిక్షన్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏమైనా కేంద్రాలున్నాయా? – వేణుగోపాలరావు, ఖమ్మం వన్ టౌన్సమాధానం: నలుగురిలో కలవకుండా దూరంగా ఉండటం, చదువులో వెనకబడటం, గతంలో ఉత్సాహంగా పాల్గొన్న కార్యక్రమాల విషయంలో ఇప్పుడు విముఖత చూపడం, ఖర్చు ఎక్కువ చేయడం, ఆ డబ్బు కోసం చోరీలు చేయడం, కేవలం ఒకరిద్దరితోనే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, కుటుంబంతో కలిసి ఫంక్షన్లకు వెళ్లకుండా ఒంటరిగా ఉండటం, ముఖంపై చిరునవ్వు మాయం కావడం, కుటుంబీకుల కళ్లలోకి చూసి మాట్లాడలేక పోవడం.. ఇవన్నీ గంజాయి/డ్రగ్ బానిసల లక్షణాలు. ఇలాంటివారి కోసం నిషా ముక్త్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా 26 ఆస్పత్రులతో పాటు 11 డీ అడిక్షన్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదిస్తే వాటి వివరాలు తెలుస్తాయి.ప్రశ్న: మా ఫ్లాట్ ఎదురుగా ఉండే నా స్నేహితురాలి కుమారుడి ప్రవర్తనలో కొత్తగా మార్పు కనబడుతోంది. ఇతను జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి రాగానే బాత్రూమ్లోకి వెళ్లి గంటల తరబడి ఉంటున్నాడు. నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. ఒక రోజు బ్యాగ్‌లో ఏదో పౌడర్ ఉన్న ప్యాకెట్ దొరికింది. ఆ బాలుడి విషయంలో ఏం చేయాలి? – ఓ మహిళ, మణికొండసమాధానం: ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యారనే అనుమానం ఉంటే వారికి 12 ప్యారామీటర్ టెస్ట్ చేయించాలి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ప్రముఖ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఈ పరీక్ష చేస్తారు. మీరు చెప్తున్న బాలుడి విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాం. ‘87126 71111’కు కాల్ చేసి చిరునామా ఇతర వివరాలు చెప్పండి. ఓ మహిళా అధికారిని పంపి విషయం తెలుసుకుని, బాలుడికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కరిస్తాం. ఆ బాలుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని తెలిస్తే అతడి పైన కాకుండా అతడిని ఈ ఊబిలోకి దింపిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మాకు సమీపంలో ఉన్న కాలేజీ ఆవరణలో చీకటి పడిన తర్వాత యువత పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. వాళ్లు సిగరెట్లు తాగుతూ గంజాయితో పాటు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా అనుమానం ఉంది. దీనిపై చర్యలు తీసుకోగలరా? – పేరు, వివరాలు గోప్యంగా ఉంచాం సమాధానం: అలాంటప్పుడు మీరు వెంటనే ‘100’లేదా ’87126 71111’కు ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. మీ పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతాం.ప్రశ్న: మా ప్రాంతంలో ఉన్న కల్లు దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకమంది ఇక్కడకు వస్తుంటారు. ఆ దుకాణంలో విక్రయించే కల్లులో ఏదైనా కలుపుతున్నారేమోనని అనుమానం ఉంది. – పేరు, వివరాలు గోప్యంగా ఉంచాంసమాధానం: దీనిపై ఏఎన్‌బీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆరా తీస్తుంది. అలాంటిది ఏమైనా ఉన్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటుంది.ప్రశ్న: గంజాయి అలవాటు సిగరెట్ నుంచి మొదలవుతుంది. పాఠశాలల పరిసరాల్లో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు అమ్మకుండా తనిఖీలు ఏమైనా చేస్తున్నారా? – వంశీకృష్ణ, విద్యారి్థ, మోడల్ స్కూల్, మందమర్రిసమాధానం: సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తుల (కోటా్ప) చట్టం–2023 ప్రకారం విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు విక్రయించే దుకాణాలు ఉండకూడదు. అలాంటి దుకాణాలపై జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విక్రేతలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.ప్రశ్న: ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రాకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – మిట్టపల్లి యుగంధర్, హెచ్ఎం, ఎంపీపీ స్కూల్ దూళికట్ట, పెద్దపల్లి జిల్లాసమాధానం: గంజాయికి దాన్ని పండించే ప్రాంతంలోనే చెక్ చెప్పాలని నిర్ణయించాం. టీఎస్ ఏఎన్‌బీ నేతృత్వంలో త్వరలో విశాఖపట్నంలో జరిగే మూడు రాష్ట్రాల అధికారులు, రాజకీయ నాయకుల భేటీలో గంజాయి కట్టడికి ప్రత్యేక కార్యాచరణ ఖరారు చేస్తాం. ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా గంజాయి పండించే ప్రాంతాలను గుర్తించనున్నాం. సరిహద్దు చెక్‌పోస్టుల్లో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం.ప్రశ్న: మాదకద్రవ్యాల కట్టడికి సారా వ్యతిరేక ఉద్యమం మాదిరిగా ఉద్యమం రావాలి. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా అందుబాటులో ఉందా? – స్వాతి, మహిళా సంఘం నాయకురాలు, సుల్తానాబాద్సమాధానం: అలాంటప్పుడు మీరు వెంటనే ‘100’లేదా ’87126 71111’కు ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మేము కూడా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఏం జరుగుతోందో తెలుసుకుంటాం. మీ పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతాం.ప్రశ్న: గ్రామాల్లో మత్తు పదార్థాల నిషేధ కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? – రాంచందర్ భీంవంశీ, ప్రజాకవి, ఉపాధ్యాయులు, జహీరాబాద్సమాధానం: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 7,500 యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఆయా స్కూళ్లు, కాలేజీల్లో ఇవి పని చేస్తున్నాయి. ప్రతి బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయిలో ఉన్న అన్ని విభాగాలు, అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి పని చేస్తున్నాం.అనూహ్య స్పందన..(నోట్: మీతో ‘సాక్షి’పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు ప్రశ్నలు వేశారు. కొందరు తమకు తెలిసిన సమాచారం ఇచ్చారు. వీటిల్లోని సున్నితాంశాలు, కీలక సమాచారాన్ని టీజీ ఏఎన్‌బీకి అందించాం. అనేక ప్రశ్నలు సారూప్యత కలిగి ఉండటంతో వాటిల్లో కొన్నింటినే ఎంపిక చేశాం)ఆ తండ్రికి వందనం..తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన ప్రత్యేక నంబర్ 87126 71111కు నిత్యం కీలక సమాచారం అందుతోందని సందీప్ శాండిల్య తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా ఛేదించిన కేసుల్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. వాటిని ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ప్రజారోగ్యానికి చేటు చేస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ–సిగరెట్లను నిషేధించింది. అయితే నగరానికి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్లో వీటిని ఖరీదు చేస్తున్నాడు. రహస్యంగా తన వద్ద ఉంచుకుని స్నేహితులతో పాటు తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. తన కుమారుడు చేస్తున్న ఈ వ్యవహారం చట్ట విరుద్ధమని భావించిన అతడి తండ్రి ఏఎన్‌బీకి సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతనితో పాటు ఇతర విక్రేతలు, వినియోగదారులైన 30 మందిని గుర్తించారు. రూ.లక్షల విలువైన ఈ–సిగరెట్లు స్వా«దీనం చేసుకున్నారు. అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.‘సరుకు’దొరకకున్నా అరెస్టు.. నానక్‌రామ్‌గూడలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయాలు భారీగా సాగుతున్నట్లు సమాచారం ఇచ్చిన యువకుడు దీనికి సాక్ష్యంగా వీడియోను పంపాడు. ఏఎన్‌బీ అధికారులు వెళ్లి దాడి చేసే సమయానికి అప్రమత్తమైన భార్యాభర్తలు తమ ఇంట్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న వీడియోను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఓ సందర్భంలో వారి కుమార్తె ‘సరుకు’అందిస్తున్నట్లు కనిపించింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆమెను మైనర్‌గా గుర్తించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 78 ప్రకారం సిగరెట్లు, మద్యం, మాదకద్రవ్యాలను చిన్నారుల చేతికి ఇవ్వకూడదు. దీని ఆధారంగా భార్యాభర్తలపై కేసు నమోదు చేసి ఏఎన్‌బీ జైలుకు పంపింది.రివర్స్ మెకానిజంతో...డార్క్‌వెబ్‌పై నిఘా ఉంచడం, అందులో జరిగే డ్రగ్స్ క్రయవిక్రయాలను అడ్డుకోవడం సాధ్యం కాదు. దీంతో ఏఎన్‌బీ రివర్స్ మెకానిజం మొదలెట్టింది. ఏ దేశంలో ఉన్న సప్లయర్‌కి ఆర్డర్ ఇచ్చినా అది పార్సిల్ రూపంలో వచ్చి పెడ్లర్‌కు చేరాల్సిందే. దీంతో వివిధ కొరియర్ సంస్థలు, ఎయిర్ కార్గో ద్వారా వచ్చే పార్సిళ్లను ట్రాక్ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మంలో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు.