అమ్మే దిగివస్తే మత్తు దిగదా.. | Punjab Lit Foundation launches Mothers Against Drugs | Sakshi
Sakshi News home page

అమ్మే దిగివస్తే మత్తు దిగదా..

Published Sat, Sep 21 2024 12:44 AM | Last Updated on Sat, Sep 21 2024 8:23 AM

Punjab Lit Foundation launches Mothers Against Drugs

రక్ష ‘మామ్‌’

పంజాబ్‌లో హెరాయిన్‌ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్‌లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్‌లో ‘మదర్స్‌ ఎగైనెస్ట్‌ డ్రగ్స్‌’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్‌ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.

పంజాబ్‌లో ‘డ్రగ్స్‌’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్‌లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్‌లో ‘మదర్స్‌ ఎగైనెస్ట్‌ డ్రగ్స్‌’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌’ అనే సంస్థ సెప్టెంబర్‌ 15న హోషియార్‌పూర్‌లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.

13 నుంచి 18 ఏళ్ల మధ్యలో
పిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్‌ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌’ స్థాపకుడు, రచయిత కుష్వంత్‌ సింగ్‌ అన్నాడు. పంజాబ్‌లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్‌ ఎగైనెస్ట్‌ డ్రగ్స్‌’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్‌లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్‌కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్‌గా మారుతున్నారు. 

వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్‌ సెంటర్స్‌లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్‌ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్‌ నుంచి భగత్‌ సింగ్‌ స్వగ్రామమైన ఖట్కర్‌ కలాన్‌ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్‌వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.

మంచాలకు సంకెళ్లు
పంజాబ్‌లో హెరాయిన్‌ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్‌ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్‌లో కొన్ని ఊళ్లు డ్రగ్స్‌ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.

తల్లులకు ట్రైనింగ్‌ ఇస్తే
మదర్స్‌ ఎగైనెస్ట్‌ డ్రగ్స్‌ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్‌ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్‌ గిల్‌ అనే బాడీ లాంగ్వేజ్‌ ఎక్స్‌పర్ట్‌ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్‌ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. 

చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్‌ ఎడిక్ట్స్‌ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్‌ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్‌లైన్‌కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.

ఎన్నో రకాలు
మత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్‌తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్‌ చలామణి కోసం పంజాబ్‌లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.

ఏం చేయాలి?
తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు.
 

అమ్మ వల్లే మారాను
‘మదర్స్‌ ఎగైనెస్ట్‌ డ్రగ్స్‌’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్‌ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్‌ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్‌ డోస్‌ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement