విద్యార్థిని రవళి ఎందుకు చనిపోయింది..?
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): కడపలో విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో మరో విద్యార్థిని బలవన్మరణం చెందింది. స్థానిక దువ్వూరు రమణమ్మ మహిళా ఎయిడెడ్ కళాశాల హాస్టల్లో గురువారం ఓ విద్యార్థిని గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు... రాపూరు మండలం పెనుబర్తికి చెందిన తన్నీరు రవళి(17) డీఆర్డబ్ల్యూ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఆవరణలోనే ఉన్న హాస్టల్లో ఉంటోంది. కాగా గురువారం ఉదయం కళాశాలకు అందరితో కలిసి బయలుదేరిన ఆమె నోటుబుక్ మర్చిపోయానంటూ తోటివారికి చెప్పి తన గదికి వెళ్లి ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుంది. ఈ సంగతి మరో విద్యార్థిని గమనించి సిబ్బందికి చెప్పడంతో వారు హుటాహుటిన ఆటోలో రవళిని సీఆర్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. ఇంగ్లిష్ లెక్చరర్ కొట్టడంతోనే రవళి మృతి చెందినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారని.. వెంటనే ఆ లెక్చరర్‌ను విచారించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రవళి బలవన్మరణానికి సీనియర్ల ర్యాగింగ్ కారణమని కొందరు చెబుతుండగా, కొంతమంది ఇంటిపై బెంగతోనే అఘాత్యానికి పాల్పడిందంటున్నారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మహేష్, సుజాతలు మాత్రం కుటుంబసభ్యులపై బెంగతో ఆత్మహత్యకు పాల్పడేంత పరిస్థితి లేదని తేల్చిచెబుతున్నారు. తమ కుమార్తె మరణంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.