dsa
-
తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
లక్డీకాపూల్ (హైదరాబాద్): తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్ఏ ల్యాబ్, యూఎస్ ఎయిడ్ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్‌లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్‌లో సీపీఆర్ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు. నిమ్స్‌లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్క్ లాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్ ఎయిడ్ డాక్టర్ వరప్రసాద్, హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరిక్ష యుద్ధ తంత్రం
న్యూఢిల్లీ: అంతరిక్షయానంలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న భారత్, అంతరిక్ష యుద్ధతంత్రంలోనూ పైచేయి సాధించే దిశగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో యుద్ధాలు సాగించేందుకు అనువైన వ్యవస్థల రూపకల్పన కోసం అంతరిక్ష రక్షణ సంస్థ(డీఎస్ఏ)ను ఏర్పాటు చేయనుంది. డీఎస్ఏకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఎస్ఆర్వో)ను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన రక్షణపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) అంతరిక్ష యుద్ధతంత్రానికి అవసరమైన అధునాతన యుద్ధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి డీఎస్ఆర్వో అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. డీఎస్‌ఏలో ఎంపిక చేసిన శాస్త్రవేత్తల బృందంతోపాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు కూడా ఉంటారు. బెంగళూరు కేంద్రంగా ఎయిర్ వైస్ మార్షల్ అధికారి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇటీవల భారత్ అంతరిక్షంలోని కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని క్షిపణిని ప్రయోగించి తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. ఈ సత్తాను సంపాదించుకున్న నాలుగో దేశంగా అగ్రరాజ్యాల సరసన నిలిచింది. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తామంటూ ఇటీవల ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీఎస్ఆర్వో ఏర్పాటుకు నిర్ణయించడం గమనార్హం. -
క్రీడలతో ప్రత్యేక గుర్తింపు
కడప స్పోర్ట్స్ : క్రీడలు ఆడటం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి లక్ష్మినారాయణశర్మ పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కడప నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడాపోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తోందన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలరని ఆయన సూచించారు. అంతకు మునుపు బాలుర విభాగంలో ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు మెడల్స్, నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు ఉమాశంకర్, గౌస్‌బాషా, ఎస్ఎండీ షఫీ, అమృత్‌రాజ్, అబ్దుల్ మునాఫ్, తమీమ్ అల్తాఫ్, ఖాదర్మోహిద్దీన్ఖాన్, శ్రీనివాసరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు నిత్యప్రభాకర్, రామాంజినేయులు, పవన్, క్రీడాకారులు పాల్గొన్నారు. హ్యాండ్‌బాల్ విజేతలు : వేంపల్లి (ప్రథమ), ఓబులవారిపల్లి (ద్వితీయ), యర్రగుంట్ల (తృతీయ). ఫుట్‌బాల్ విజేతలు : కడప (ప్రథమ), యర్రగుంట్ల (ద్వితీయ), కమలాపురం (తృతీయ). -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
కడప స్పోర్ట్స్: క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం కడప నగరంలోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఈ పోటీలను డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 29న మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు వివిధ క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. «శాప్ డైరెక్టర్ జయచంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ధ్యాన్‌చంద్ చూపిన పోరాటపటిమను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు.అనంతరం పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వల్లూరు కేజీబీవీ వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత, కోచ్ గౌస్‌బాషా, నూర్, సిబ్బంది సూర్యనారాయణరాజు, రామకృష్ణారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.