ముగిసిన డీటీఏ వార్షికోత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: వారాంతాన్ని హస్తినలోని తెలుగువారు ఆహ్లాదంగా గడిపారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఢిల్లీ తెలుగు అకాడమీ 27వ వార్షికోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏపీభవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సందడి మొదలైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తరాఖండ్ గవర్నర్ డా.అజీజ్ ఖురేషి తదితరులు హాజరయ్యారు. సంగీత దర్శకుడు కె. రామాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెనింగ్లో ప్రముఖ గాయకురాలు విజయలక్ష్మి తదితరుల గేయాలాపన శ్రవణానందంగా సాగింది. అనంతరం హాస్యనటులు గౌతంరాజు, అశోక్కుమార్ల హాస్యోక్తులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇరువురి హాస్యవల్లరిలో అంతా హాయిగా నవ్వుకున్నారు. కాగా, కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకుడు డా. కె విశ్వనాథ్, నటుడు సాయికుమార్, తనికెళ్ల భరణి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్టు నిర్వాహకులు ముందస్తుగా ప్రచారం చేసినప్పటికీ వారెవరూ హాజరు కాలేదు. దీంతో వచ్చిన అతిథులకు ఉసూరుమనిపించింది. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీఏ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.