ముంబాయి ఎయిర్‌పోర్టులో భారీ నగదు సీజ్
ముంబాయి ఎయిర్‌పోర్టులో భారీగా కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లను కస్టమ్స్ ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ బుధవారం సీజ్ చేసింది. భారత పాస్‌పోర్టు కలిగి ఉన్న ఆరిఫ్ కోయంటే అనే వ్యక్తి దుబాయ్‌కి వెళ్లడానికి స్పైస్ జెట్ విమానం ఎస్జీ 013 ఎక్కడానికి బయలుదేరాడు. అతని మధ్యలోనే ఆపిన కస్టమ్స్ ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ ఆరిఫ్ బ్యాగులన్నీ చెక్ చేసింది. ఈ తనిఖీల్లో 52 ఎన్విలాప్ల్లో దాచుకున్న రూ.25 లక్షల కొత్త కరెన్సీని అధికారులు రికవరీ చేసుకున్నారు.
కరెన్సీని దాచుకున్న ఈ 52 ఎన్విలాపులను రెడిమేడ్ గార్మెంట్స్‌లో చక్కగా చుట్టి దాచిపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుడిపై కేసు నమోదుచేసి, అరెస్టుచేశారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి అక్రమార్కులు ఎయిర్‌పోర్టుల ద్వారా భారీ మొత్తంలో కొత్త, పాత కరెన్సీని తరలిస్తూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కోట్లకు కోట్ల కరెన్సీ, భారీగా బంగారం ఎయిర్‌పోర్టుల తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి.