చిక్కిన చీటింగ్ ముఠా
సాక్షి, పశ్చిమగోదావరి(జంగారెడ్డిగూడెం) : కరెన్సీ చీటింగ్ ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఒకటికి రెండు నుంచి మూడు రెట్లు ఇస్తామని ప్రజలను, ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న డబ్లింగ్ కరెన్సీ ముఠా సభ్యుడొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. ముగ్గురు యువకులు పరారీ కాగా, దొరికిన యువకుడి నుంచి రూ.34 లక్షల చిల్డ్రన్ బ్యాంక్ కరెన్సీ నోట్లు, ఒక కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 వేలు, రూ.500, రూ.200, రూ.100 విలువ కలిగిన చిల్డ్రన్ బ్యాంక్ కరెన్సీ నోట్లను మోసం చేసేందుకు వినియోగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 15న ‘సాక్షి’లో ‘డబ్లింగ్ కరెన్సీ ముఠా హల్చల్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పట్లోనే పోలీసులను అప్రమత్తం చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ ముఠా నివశిస్తున్న నివాసంలో ఐడీ పార్టీ పోలీసులు సోదాలు చేయగా కరెన్సీ పేరుతో మోసాలు చేసేందుకు, బెదిరించేందుకు ముఠా వినియోగించే పోలీసు యూనిఫాం, పోలీస్ బెల్టు లభించాయి. దీంతో కొందరు యువకులను, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న కారును అప్పుడే స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఏం జరిగిందో ఏమో గానీ, ఈ సభ్యులను మూడు నాలుగు రోజులు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి పంపించి వేశారు. దీంతో ఈ ముఠా ఆగడాలు మరింత పెరిగి రెచ్చిపోయాయి. రాత్రి సమయంలో చీకట్లో అసలు నోట్లను పోలిన చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. చివరకు ఈ నెల 4వ తేదీ రాత్రి స్థానిక రామచంద్రపురంలో కారులో వచ్చిన నలుగురు యువకులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని నిలదీశారు. దీంతో నలుగురిలో ముగ్గురు పారిపోగా, ఒకరిని, కారును, రూ. 34 లక్షల అసలు నోట్లను పోలిన చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న యువకుడు మండలంలోని మైసన్నగూడెంకు చెందిన వ్యక్తిగా తెలిసింది.
ముఠా కార్యకలాపాలు ఇలా..
జంగారెడ్డిగూడెం కేంద్రంగా డబ్లింగ్ కరెన్సీ ముఠా తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. లక్షకు మూడు లక్షల రూపాయలు దొంగనోట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మకాం వేసి వీరి కార్యకలాపాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈ ముఠాలో ఎక్కువగా యువకులు ఉండటం గమనార్హం. సుమారు 30 మంది వరకు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని యువకులు ఒక ముఠాగా ఏర్పడి డబ్లింగ్ కరెన్సీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. రెండు మూడు కార్లను వినియోగిస్తూ రహస్యంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీరి చేతిలో పడి ఇప్పటికే చాలా మంది మోసపోయినట్లు తెలిసింది. స్థానిక ఉప్పలమెట్ట, డాంగేనగర్ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులు, పాతబస్టాండ్‌కు చెందిన ఒక వ్యక్తి తూరల లక్ష్మీపురానికి చెందిన కొంతమంది, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన వారు సుమారు 30 మంది ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. ఒకటికి మూడు రెట్లు ఇస్తామని నమ్మించి డబ్బులిచ్చే సమయంలో పోలీస్ సైరన్వాహనంతో వచ్చి భయబ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్నారు.
వీరు వినియోగించే కార్లకు రకరకాల నెంబరు ప్లేట్లు వినియోగించి, మరికొన్నిసార్లు నెంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతూ యథేచ్ఛగా ఈ డబ్లింగ్ కరెన్సీ ముఠా దోచుకుంటోంది. గతంలో పట్టణానికి చెందిన ఒక యువకుడు వీరి చేతిలో మోసపోయాడు. లక్షకు మూడు లక్షల రూపాయలు ఇస్తాననడంతో ఆశపడిన ఆ వ్యక్తి రూ. 50 వేలు ఇచ్చి మోసపోయాడు. రూ. 50 వేలకు రూ. లక్షన్నర ఇస్తానని బేరం కుదుర్చుకున్నారు. ఆ వ్యక్తిని రూ.50 వేలు తీసుకుని నల్లజర్ల మండలం పోతవరం రమ్మనడంతో అక్కడికి వెళ్లాడు. ఒక కారులో వచ్చిన డబ్లింగ్ కరెన్సీ ముఠా ఆ వ్యక్తి నుంచి రూ.50 వేలు తీసుకుని లెక్కిస్తుండగా, వెనుక నల్లరంగు కారు ఒకటి పోలీస్ సైరన్‌తో వచ్చి బెదిరించారు. దీంతో కంగారుపడిన రూ.50 వేలు ఇచ్చిన వ్యక్తి పారిపోగా, రూ.50 వేలు తీసుకుని డబ్లింగ్ కరెన్సీ ముఠా రెండు కార్లలో పారిపోయారు. అతని సెల్‌ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు.
చివరకు ఆ వ్యక్తి కొద్ది రోజులు వారి చుట్టూ తిరిగి తూరల లక్ష్మీపురంలోని ఒక వ్యక్తిని ఆశ్రయించగా, ఆ వ్యక్తి డబ్లింగ్ కరెన్సీ ముఠా సభ్యులను పిలిచి చివరకు రూ.20 వేలు ఇప్పించారు. అలాగే నల్లజర్ల మండలం సింగరాజుపాలెంకు చెందిన ఒక వ్యక్తి నుంచి లక్ష రూపాయలు ఈ డబ్లింగ్ కరెన్సీ ముఠా దోచుకున్నట్లు తెలిసింది. అంతేగాక గతంలో జంగారెడ్డిగూడెం కార్ స్టాండ్‌లో ఒక వ్యక్తికి చెందిన కారును ఈ ముఠాసభ్యులు సొంత డ్రై వింగ్ (సెల్ఫ్ డ్రై వింగ్) పేరుతో వేసుకుని వెళ్లి కొద్ది రోజులు రాకపోవడంతో అనుమానం వచ్చిన కారు స్టాండ్‌లోని డ్రైవర్లు ఎట్టకేలకు భీమడోలు వద్ద కారును పట్టుకుని నానా అవస్థలు పడి కారును వెనక్కి తెచ్చుకున్నారు. ఈ ముఠా ఎక్కువగా ఒక తెలుపు, నలుపు కార్లను ఫ్యాన్సీ నెంబర్లతో వాడుతున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వీరు చేసిన మోసాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు.