నిరాదరణలో డచ్ భవనం
– పర్యాటక అభివృద్ధి పేరుతో లక్షలు వృథా
– పట్టించుకోని పాలకులు, అధికారులు
శ్రీకాకుళం టౌన్: అందమైన ప్రదేశం.. ఆహ్లాదాన్నిచ్చే వాతావరణం. దక్షిణ దిక్కున నాగావళి పరవళ్లు. ఈ ప్రదేశాన్ని ఎంచుకుని ఈస్టు ఇండియా కంపెనీవారు దేశంలో వ్యాపార కార్యకలాపాలు సాగించినపుడు ఎల్తైన కట్టడాన్ని నిర్మించుకున్నారు. కళింగపట్నం తీరం నుంచి వాణిజ్య వ్యాపారాలు సాగించే డచ్ దేశస్థులు ఇక్కడ అతిథి గృహాలను ఏర్పాటు చేసుకుని సేదతీరేవారని ప్రతీతి. ఆనాటి కట్టడం పైకప్పు లేక పోయినా గోడలు నేటికీ చెక్కు చెదరడం లేదు. ఇలాంటి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోకుండా పాలకులు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
చెక్కుచెదరని డచ్ భవనం
దశాబ్థాలనాటి డచ్ కట్టడం నేటికీ చెక్కు చెదరక వారి ఆనవాలుగా దర్శన మిస్తోంది. కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ భవనం పక్కనే ఆర్అండ్బీ అతిథిగృహం కూడా ఉంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంతో మంది అతిథిలు ఇక్కడ బస చేసినా పక్కనే ఉన్న డచ్ భవనాన్ని సందర్శించేవారు లేరు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఉన్నతాధికారులు మాత్రం చారిత్రాత్మక కట్టడంగా భవనాన్ని సందర్శించి మురిసిపోతారు. డచ్ కట్టడం చరిత్రను అడిగి తెలుసుకునేందుకు ఆసక్తికనబరుస్తారు. ఇలా ఆసక్తికనబరిచిన వారు పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావించి పర్యాటక శాఖ సహకారాన్ని కోరుతూ లేఖలు రాస్తున్నారు. పర్యాటక శాఖ అధికారులు ఆసక్తికనబరిస్తే చాలు మెరుగులు దిద్దడానికి నిధులు విడుదల చేసి తర్వాత ఏం అభివృద్ధి చేయాలో తెలియక విడిచిపెట్టేస్తున్నారు.
అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు
డచ్ భవనం అభివృద్ధి పేరుగో గత అయిదారేళ్లలో రూ.30 నుంచి 40 లక్షల మధ్య వివిధ అభివృద్ధి పథకాల నుంచి నిధులు కేటాయించి ఖర్చు చేశారు. కాని పర్యాటక శోభ మాత్రం కనిపించలేదు. విదేశీ పర్యాటకులకే కాదు స్వదేశీ పర్యాటకులను ఆకట్టు కోలేకపోయిన ఈ భవనం అతిథిగృహంగానైనా మారితే పర్యాటక శోభ వస్తుందేమోనని పురాతన పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారు సూచిస్తున్నారు. ఆనాటి అతిథిగృహంగానే ఉపయోగపడిన భవనంలో మార్పులు తీసుకురాకుండా మాన్యుమెంట్గానే పరిగణించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఘనమైన చరిత్ర కలిగిన ఈ భవనం పర్యాటక అభివృద్ధికి ఎప్పటికి నోచుకుంటుందో వేచిచూడాలి.