సహనం... ధైర్యం
డ్యూటిప్స్
* ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులను ధైర్యంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం ఒక్కటే సర్వస్వం కాదనే సంగతిని గుర్తెరగాలి. ఉద్యోగం కారణంగా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేంతగా ఒత్తిడిని పెంచుకోవడం సరికాదు.
* పనిభారం పంపిణీలో సమతుల్యత లోపించినట్లయితే, నిశ్శబ్దంగా భారాన్ని భరిస్తూ రావడం అంత క్షేమం కాదు. ఈ అంశంలో వివక్ష ఎదుర్కొంటున్నట్లు భావిస్తే, బాస్‌తో నేరుగా చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా ప్రయత్నించడం మంచిది.
* ఉద్యోగ జీవితంలో రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు తారసపడుతూ ఉంటారు. వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు ఎదురైనంత మాత్రాన కుంగిపోవడం మంచిది కాదు. విమర్శల్లో సహేతుకత ఉంటే, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకునే చర్యలు మొదలుపెట్టండి. పనితో నిమిత్తంలేని అనవసరమైన విమర్శలను పట్టించుకోకండి.
* ఉద్యోగ జీవితం విజయవంతంగా సాగాలంటే, నిరంతర అధ్యయనం తప్పదని గ్రహించండి. తెలియని విషయాలు ఏవైనా ఉంటే సీనియర్లను అడిగి తెలుసుకోవడానికి మొహమాటపడకండి. అప్పగించిన పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడాన్ని అలవాటుగా మార్చుకోండి.
* మొండితనం, పిరికితనం... ఈ రెండూ ఉద్యోగ జీవితానికి చేటు చేస్తాయి. నిక్కచ్చిగా ఉంటూనే నిలకడగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. పిరికితనానికి పోయి వెనుకంజ వేసినా, మొండితనానికి పోయి దూకుడుగా వ్యవహరించినా సమస్యలు మరింత జటిలమై, కెరీర్ దెబ్బతింటుంది.