మెుక్కలంటే ఆయనకు ప్రాణం
ఐదేళ్లుగా మొక్కలు పంపిణీ చేస్తున్న పర్యావరణ ప్రేమికుడు
ఇప్పటివరకు తొమ్మిది గ్రామాల్లో 2300 మొక్కలు పంపిణీ
ఎల్లారెడ్డిపేట : ఇంటింటా మొక్కలు పెంచుదాం... అందరికీ ఆరోగ్యం పంచుదాం... అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు ఎల్లారెడ్డిపేటకు చెందిన దుంపెన రమేశ్. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి 2011 సంవత్సరం నుంచి మొక్కల పంపకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 2300 మొక్కలను ప్రజల చేత నాటించి, పర్యావరణ ప్రేమికుడిగా స్ఫూర్తి నింపుతున్నారు.
తన చిన్నతనం నుంచే ఇంట్లో మొక్కలు పెంచడం మొదలు పెట్టారు రమేశ్. అదే అలవాటు క్రమంగా వయస్సుతోపాటు పెరిగింది. ప్రస్తుతం ఆయన ఇంటి పెరడంతా చూడముచ్చటగా ఉంటుంది. కొబ్బరి, మామిడి, నిమ్మ, మల్లె ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల చెట్లు తన ఇంట్లో రా..రమ్మంటూ ఆహ్వానిస్తాయి. అలాంటి వాతావరణమే అందరి ఇండ్లలో చూడాలని భావించిన రమేశ్ 2011 నుంచి మొక్కల పంపకం చేపట్టారు. పంపిణీ చేసిన మొక్కలను వారు ఎలా సంరక్షిస్తున్నారనే దానిపై వారానికోసారి గ్రామాలు తిరుగుతూ పరిశీలించడం విశేషం. ఇప్పటివరకు ఎల్లారెడ్డిపేట, నారాయణపూర్, దుమాల, బొప్పాపూర్, గొల్లపల్లి, బండలింగంపల్లి, సింగారం, అల్మాస్పూర్, రాజన్నపేటలో మొక్కలను వితరణ చేశారు. పర్యావరణంపై ప్రజలను చైతన్యపరుస్తున్నందున వివిధ స్వచ్ఛంద సంఘాలు పలుమార్లు సన్మానించాయి. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చట్టం చేయాలి : రమేశ్
మొక్కలను నాటడంపై ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మెుక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చూడాలి. లేకుంటే రేషన్‌బియ్యం, ఇంటికి నల్లాలు ఇవ్వకుండా ఆదేశాలు జారీచేయాలి. దీంతో ప్రతి ప్రతి ఒక్కరూ మెుక్కల పెంపకంపై దృష్టి సారిస్తారు. పర్యావరణాన్ని రక్షించి భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనేదే నా ఆకాంక్ష.