గూగుల్ సరికొత్త వీడియో కాలింగ్ యాప్
న్యూఢిల్లీ: ఫేస్‌టైమ్, స్కైప్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కి పోటీగా టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా డ్యువో పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరే టింగ్ సిస్టమ్‌ల ఆధారిత స్మార్ట్ఫోన్లలో ఇది పనిచేస్తుంది. వీడియో కాలింగ్‌ను మరింత సులభతరంగా చేసే ఈ యాప్‌ను మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ అందుబాటులోకి రాగలదని గూగుల్ గ్రూప్ ప్రోడక్ట్ మేనేజర్ అమిత్ ఫులే తెలిపారు. విడిగా యూజర్‌నేమ్/అకౌంట్ లాంటివి అక్కర్లేకుండా యూజర్లు తమ ఫోన్ నంబర్ని ఉపయోగించే డ్యువో ద్వారా వీడియో కాల్ చేయొచ్చని వివరించారు. తక్కువ బ్యాండ్‌విడ్త్‌లోనూ మెరుగ్గా పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు అమిత్ తెలిపారు.
డ్యుయో యాప్ ద్వారా గూగుల్ 'నాక్ నాక్' పేరిట మరో కొత్త ఫీచర్ ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో కాలర్స్ సమాధానం ఇచ్చేందుకు ముందే.. కాల్ చేసినవారి లైవ్ వీడియో కనిపించే అవకాశం ఉంటుంది. నెట్వర్క్ బలహీనంగా ఉన్నప్పటికీ ఈ యాప్ వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు గూగుల్ చెప్తోంది. అంతేకాక నెట్వర్క్ కనెక్షన్లకు అనుగుణంగా కాల్ క్వాలిటీ కూడా మారేట్టు డుయోను రూపొందించామని, దీనికి తోడు రిజల్యూషన్ కూడా తగ్గించుకొని మృదువుగా మాట్లాడుకునే అవకాశం డుయోలో ఉన్నట్లు గూగుల్ తెలిపింది. మరోవైపు డుయో వైఫై, సెల్యులార్ డేటాల మధ్య స్వయంచాలకంగా మారుతుందని, దీంతో వీడియో కాల్ మాట్లాడుతుండగా కట్ అయ్యే అవకాశం ఉండదని తెలిపారు.