duplicate documents case
-
రవిప్రకాశ్ కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు రేపటికి వాయిదా పడింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఈ రోజు(సోమవారం) హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రవిప్రకాశ్ దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) తమ వాదనలు వినిపిస్తూ..రవిప్రకాశ్ తన 9శాతం షేర్లలో 40 వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. మెజారిటీ షేర్హోల్డర్స్కు తెలియకుండా రూ. 99వేలకు టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేశాడని కోర్టుకు తెలిపారు. కావాలనే శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు వేయించాడని ఆరోపించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు పిలిచిన హాజరు కాలేదని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు. ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
రవిప్రకాశ్ కేసులో తొలగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో విక్రయం తదితర కేసుల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దర్యాప్తులో సహకరించని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ వైఖరిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీవీ9కి సంబంధించి అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పలు సాక్ష్యాలు సంపాదించిన పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణలో తలమునకలయ్యారు. ఇప్పటికే ఫోర్జరీ కేసులో సంస్థ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రవిప్రకాశ్ అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన కేసులపై దృష్టి సారించారు. ఈ కేసులో శివాజీ– రవిప్రకాశ్ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సంగ్రహించిన విషయం తెలిసిందే. చానల్ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా కేసులో కీలకం కానున్నాయి. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకు విక్రయించడంపైనా పోలీసుల సందేహాలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వా ధీనం చేసుకున్న పోలీసులు వాటి విశ్వసనీయతపై నిగ్గు తేల్చనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు సినీనటుడు శివాజీ తనకు మంచిమిత్రుడని చెప్పిన రవిప్రకాశ్.. అతన్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మౌనం వహించడం విశేషం. మరోవైపు సైబరాబాద్ పోలీసులపైనా రవిప్రకాశ్ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్ విచారణను సాంతం పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. రెండు కమిషనరేట్లలో పోలీసులు ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలు సరిపోలేదని అనిపిస్తే.. మరోసారి రవిప్రకాశ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళతాం.. రవిప్రకాశ్ కేసు విషయమై ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్ కుమార్ సైబరాబాద్ కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు ఫిర్యాదులోని అం శాల ఆధారంగా జరుగుతోంది. తదుపరి విచారణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను సోమవారం న్యాయస్థానం ముందుంచుతాం. తదుపరి దర్యాప్తు ముందుకుసాగేలా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తాం.. అని అన్నారు. లోపల ఒకలా.. బయట మరోలా.. కేసు సాంతం రవిప్రకాశ్ వ్యవహారశైలి వింత గా ఉంటూ వస్తోంది. లోపల విచారణలో ఒకలా.. బయట మీడియాకు మరోలా కనిపిస్తూ.. విచార ణను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. లోపల మాత్రం దర్యాప్తునకు సహకరించట్లేదు. కేసు నమోదైనప్పటి నుంచి కోర్టులో పిటిషన్ల విచా రణ జరుగుతున్నపుడు వాటిపై ప్రభావం చూపేలా 9వ తేదీన ఒకసారి, 22న మరోసారి వీడియోలు రిలీజ్ చేశాడు. విచారణకు హాజరైనప్పుడు మాత్రం ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. పైగా ప్రశ్నావళి రాసిస్తే.. తాను వాటికి సమాధానాలు రాసిస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓ 10 నిమిషాలు ప్రశ్నలు అడిగాక తల టేబుల్‌పై పెట్టుకుని పడుకుంటున్నారు. విచారణ కు సంబంధించిన వీడియో రికార్డింగ్ అంతా తనికివ్వాలంటూ పోలీసులను కోరుతున్నారు. 6 నెలల తరువాత అసలు యుద్ధం మొదలుపెడతా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఒక్కటి కూడా పాటించకుండా విచారణకు సహకరించడం లేదు. -
రెండోసారి విచారణకూ రవిప్రకాశ్ గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో నకిలీ పత్రాల సృష్టి, సంతకం ఫోర్జరీ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ రెండో నోటీసుకు కూడా స్పందించకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.160 సీఆర్పీసీ కింద ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు రవిప్రకాశ్ హాజరు కాకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయసలహాను తీసుకుంటున్నారు. ఒకవేళ సోమవారం రవిప్రకాశ్ విచారణకు హాజరైతే ఓకే కానీ, లేనిపక్షంలో వారంట్ ద్వారా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సోమవారం తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సీఆర్పీసీ 160 కింద శనివారం జారీ చేసిన నోటీసును బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటి గోడకు అంటించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు ఒక్కరోజులో హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్న ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌కు రవిప్రకాశ్ రాలేదు. అయితే, అలంద మీడియా సంస్థ డైరక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏప్రిల్ 24, 30 తేదీల్లో రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎఫ్ఐఆర్లు నమోదైన విషయాలపై 160 సీఆర్పీసీ కింద రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, మాజీ సీఎఫ్ఓ మూర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటికి మూర్తి ఒక్కరే స్పందించి గత మూడ్రోజుల నుంచి పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీలు మాత్రం ఇంత వరకు హాజరుకాలేదు. అయితే రవిప్రకాశ్, శివాజీలు పది రోజుల గడువు కోరినప్పటికీ దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి అంత సమయం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫోర్జరీ కేసులో విచారణకు టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తి ఆదివారం మూడోరోజూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అతనితో పాటు హెచ్ఆర్, అడ్మిన్, అకౌంట్స్ వ్యవహారాలు చూస్తున్న ముగ్గురు కూడా పోలీసుల ఎదుట హాజరైనట్టు తెలిసింది. వీరిచ్చిన వివరాలతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోర్జరీ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎవరి కోసం చేశారు.. ఎలా చేశారు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నారు. సైబర్ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సారథ్యంలోని సైబర్ క్రైమ్ బృందం ఈ కేసు విచారణను పకడ్బందీగా చేస్తోంది. -
‘అయ్యోరు’ అక్రమాలపై విచారణ ముమ్మరం
నెల్లూరు: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకులను బురిడీ కొట్టించిన అయ్యోరు అక్రమ మూలాలను వెలికితీసేందుకు విచారణను ముమ్మరం చేశారు. అంతుకు మునుపు విచారణ బాధ్యతలు నిర్వహిస్తున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ చెంచురామారావుపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు బాధ్యతలను నగర డీఎస్పీ జి.వెంకటరాముడుకు అప్పగించారు. తాజాగా ఆయన సోమవారం అర్ధరాత్రి ఇద్దరిని అరెస్ట్‌చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి.వెంకటరాముడు నిందితుల వివరాలను వెల్లడించారు. బాలాజీనగర్‌కు చెందిన పిట్టి మహేష్‌బాబు నకిలీపత్రాలు, నకిలీస్టాంపులను తయారుచేయడంలో సిద్దహస్తుడు. నవాబుపేట నజీర్తోటకు చెందిన గోగుల రమేష్ నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్స్లు చేయించేవాడు. వీరిద్దరు సత్యసాయి అక్రమాల్లో భాగస్వాములు కావడంతో బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ సోమవారం అర్ధరాత్రి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర ద్వారం వద్ద ఉండగా డీఎస్పీ అరెస్ట్‌చేశారు. ఈ కేసులో 12 మంది నిందితులను అరెస్ట్చేశామని, మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సై సుధాకర్‌రావు చెప్పారు.