నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకులను బురిడీ కొట్టించిన అయ్యోరు అక్రమ మూలాలను వెలికితీసేందుకు విచారణను ముమ్మరం చేశారు.
నెల్లూరు: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకులను బురిడీ కొట్టించిన అయ్యోరు అక్రమ మూలాలను వెలికితీసేందుకు విచారణను ముమ్మరం చేశారు. అంతుకు మునుపు విచారణ బాధ్యతలు నిర్వహిస్తున్న బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ చెంచురామారావుపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు బాధ్యతలను నగర డీఎస్పీ జి.వెంకటరాముడుకు అప్పగించారు.
తాజాగా ఆయన సోమవారం అర్ధరాత్రి ఇద్దరిని అరెస్ట్‌చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి.వెంకటరాముడు నిందితుల వివరాలను వెల్లడించారు. బాలాజీనగర్‌కు చెందిన పిట్టి మహేష్‌బాబు నకిలీపత్రాలు, నకిలీస్టాంపులను తయారుచేయడంలో సిద్దహస్తుడు. నవాబుపేట నజీర్‌తోటకు చెందిన గోగుల రమేష్ నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్స్‌లు చేయించేవాడు. వీరిద్దరు సత్యసాయి అక్రమాల్లో భాగస్వాములు కావడంతో బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ సోమవారం అర్ధరాత్రి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర ద్వారం వద్ద ఉండగా డీఎస్పీ అరెస్ట్‌చేశారు. ఈ కేసులో 12 మంది నిందితులను అరెస్ట్‌చేశామని, మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సై సుధాకర్‌రావు చెప్పారు.