తాతయ్య స్కూల్కు ఎందుకు వెళ్లాడంటే..
ఫెదికోలా (నేపాల్):
కని పెంచిన పిల్లలు దూరంగా ఉండటం, భార్య మరణించడంతో 68 ఏళ్ల దుర్గా కామి ఒంటరివాడయ్యాడు. ఆ ఒంటరితనాన్ని అధిగమించేందుకు అతను ఓ అద్భుత మందు కనుగొన్నాడు. మనవళ్లను స్కూలుకు తీసుకెళ్లాల్సిన వయసులో యూనిఫాం ధరించి స్కూల్ మెట్లెక్కాడు. పుస్తకాలు పట్టడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే.. ఓ టీచర్ సహాయంతో వాటిని అధిగమించాడు. ఆలోచన బలంగా ఉండాలే గానీ అన్ని అవరోధాలు జయించొచ్చని నిరూపించాడు.
నలుగురికి తండ్రి, 8 మందికి తాత (వారిలో ఆరుగురు స్కూలుకు వెళ్తున్నారు) అయిన కామి, భార్య మరణంతో ఒంటరి వాడయ్యాడు. నేపాల్ రాజధాని కఠ్మాండుకు పశ్చిమాన 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్యాంగ్జా జిల్లాలోని ఓ మారుమూలు ప్రాంతంలోని ఎత్తైన కొండ పైన దుర్గా కామి ఇళ్లుంది. ఎండకు ఎండి, వానకు తడిసేలా చాలా చోట్ల చిల్లులున్న ఇళ్లు, ఎప్పుడో గానీ రాని కరెంటు ఇది అతని దుస్థితి.
మారుమూలు ప్రాంతంలో కొండపైన ఇల్లు ఉండటంతో కామి పిల్లలు అతన్ని వదిలి వెళ్లిపోయారు. ఓ టీచర్ సహాయంతో ముందుగా రాయడం, చదవడం నేర్చుకొని ఇప్పుడు శ్రీ కళా బైరబ్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నాడు. ఒంటరితనం నుంచి ఏకంగా 200 మంది పిల్లలున్న స్కూల్లో అందరితో కలివిడిగా గడుపుతున్నాడు.
ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి, తన బాధలను మరచిపోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్కూల్కు వెళుతున్నానని కామి తెలిపాడు. 14, 15 ఏళ్ల విద్యార్థులతో ఇప్పుడు అతను పక్క పక్కనే కూర్చొని పాఠాలు వింటున్నాడు. వయసులో పెద్ద అయినా అన్ని కార్యక్రమాల్లో మిగిలిన విద్యార్థులతో కలిసి కామి పాల్గొంటున్నాడు. ముఖ్యంగా వాలీ బాల్ ఆడే సమయంలో ఎక్కడున్న టక్కున వాలిపోతుంటాడు.. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న అతన్ని క్లాస్మెట్లు సరదాగా కామి 'బా'(తండ్రి) అని పిలిస్తుంటారు. కామి చదువులో కొంచెం వీక్ అని, అతనికి ఏవైనా అర్థం కాకపోతే తామే సహాయం చేస్తున్నామని క్లాస్ మేట్స్ చెబుతున్నారు. 10 పాసైతే తప్పకుండా షేవింగ్ చేసుకుంటానని తనతో చెప్పినట్టు క్లాస్మేట్ సాగర్ తెలిపాడు. ఎంత వరకు చదువుకుంటావని అడగ్గా.. చనిపోయే వరకు చదువుతూనే ఉంటా అని కామి చెబుతున్నాడు.