Durgapur
-
పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం
కోల్కత్తా: పెళ్లి బాజాలు మోగాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో వివాహం జరుగుతుందనగా.. అనుమానాస్పద స్థితిలో పెళ్లికొడుకు సహా అతడి అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో హఫ్నా సోరెన్ కుటుంబం నివాసం ఉంటుంది. హఫ్నా సోరెన్‌కు ఇద్దరు కుమార్తెలు(సుమీ సోరెన్, బహమనీ సోరెన్) ఓ కుమారుడు(మంగళ్ సోరెన్) ఉన్నారు. కాగా, కుమారుడు మంగళ్ సోరెన్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫు కుటుంబసభ్యులు మంగళ్ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. అయితే, పెళ్లి పనుల్లో భాగంగా హఫ్నా సోరెన్ శనివారం ఉదయం బయటకు వెళ్లారు. ఇక, ఆయన ఇంటి తిరిగి వచ్చే సరికి వారి ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే సమయంలో ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. దీంతో, వెంటనే ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు. వారు ముగ్గురు మంటల్లో సజీవ దహనమయ్యారు. కాగా, హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు -
Spicejet: భారీగా కుదిపేసిన విమానం.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
కోల్‌కతా: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి గాల్లో ఉండగా భారీ కుదుపునకు గురైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ బీ-373 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్ ఫ్లైట్ ఎస్జీ-945 ముంబై నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఏడున్నర గంటలకు అది అండల్‌లోని కాజి నజ్రుల్ ఇస్లాం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే కాసేపట్లో గమ్యానికి చేరుతుందనగా.. గాల్లో ఉండగానే అది తీవ్రంగా కుదుపున లోనైంది. దీంతో లగేజీ మీద పడడంతో పలువురు ప్రయాణికులకు(40 మంది దాకా అని కొన్ని కథనాలు.. 17 మంది మరికొన్ని కథనాలు చెప్తున్నాయి ) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు. అయితే.. ప్రమాదం జరిగినప్పటికీ ఫ్లైట్ దుర్గాపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్యాసింజర్లకు చికిత్స అందించారు. వీళ్లలో కొందరిని డిశ్చార్జి చేయగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పేమీ లేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. బలమైన గాలుల వల్లే కుదుపునకు విమానం లోనైనట్లు తెలుస్తోంది. -
సీపీఎం ఆఫీసులో బాంబులు స్వాధీనం
దుర్గాపూర్: పశ్చిమబెంగాల్లో దుర్గాపూర్‌లోని సీపీఎం కార్యాలయంలో బాంబులను, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పార్టీ కార్యాలయంలో సోదాలు చేయగా రెండు బ్యాగుల్లో దాచిన 15 నుంచి 20 బాంబులను గుర్తించారు. 7 పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు. పార్టీ కార్యాలయంలో బాంబులను, ఆయుధాలను ఉంచిన ఘటనలో సీపీఎంకు సంబంధంలేని ఆ పార్టీ జోనల్ సెక్రటరీ పంకజ్ రాయ్ సర్కార్ చెప్పారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. కాగా ప్రజల్లో భయాందోళలు కలిగించడానికి సీపీఎం ఆయుధాలను సమకూర్చుకుందని ఐఎన్టీటీయూసీ నాయకుడు ప్రభాత్ ఛటర్జీ ఆరోపించారు. -
భారత్‌లో నిర్మాణ రంగం అభివృద్ధి
సాక్షి, బెంగళూరు: భారత దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని ప్రముఖ కన్స్ట్రక్షన్ కెమికల్స్ తయారీ సంస్థ ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ సీఈఓ మార్క్ ఎస్లమ్లూ వెల్లడించారు. తద్వారా గృహ నిర్మాణ రంగంలో వినియోగించే టైల్స్, స్టోన్ ఫ్లోరింగ్ తదితర ఉపకరణాల రంగం కూడా దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. టైల్స్, స్టోన్ ఫ్లోరింగ్‌ల తయారీ కోసం ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ నగరంలో ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ పేరిట ఏర్పాటు చేసిన సరికొత్త ప్లాంట్‌ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహ నిర్మాణ రంగంలో ఉపయోగించే కన్స్ట్రక్షన్ కెమికల్స్ (టైల్స్, స్టోన్ ఫ్లోరింగ్ తదితరాలు)రంగం భారతదేశంలో ప్రస్తుతం రెండు వేల కోట్ల షేర్ మార్కెట్‌ను కలిగి ఉందని పేర్కొన్నారు. మరో ఐదారేళ్లలో ఈ రంగం ఐదు వేల కోట్ల షేర్ మార్కెట్‌ను అందుకోగలదని తెలిపారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా నిర్మాణరంగానికి హబ్‌గా తయారైందని అందుకే తమ ప్లాంట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేశామని ఆర్డెక్స్ ఎండ్యూరా సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ గోపినాథ్ క్రిష్ణన్ వెల్లడించారు. నగరంలో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ను గంటకు 60 టన్నుల నాణ్యమైన టైల్స్‌ను తయారుచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్‌లో తయారయ్యే టైల్స్, ఫ్లోరింగ్ ఉపకరణాలను శ్రీలంకతో పాటు అరేబియా దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు గోపినాథ్ తెలిపారు. తమ సంస్థ ప్రస్తుతం 100 కోట్ల మార్కెట్ షేర్‌ను కలిగి ఉందని, రానున్న ఆర్థిక సంవత్సరం ముగింపునాటికి మరో 20 శాతం పెరుగుదలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 2014 పూర్తయ్యే నాటికి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటుచేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు గోపినాథ్ చెప్పారు. కార్యక్రమంలో ప్రిజమ్ సిమెంట్స్ మేనేజింగ్ డెరైక్టర్ విజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.