సుపరిపాలనకు మార్గం!
సంపాదకీయం: సుపరిపాలనకు వెన్నెముకగా, సమర్ధతకు మారుపేరుగా ఉండాల్సిన సివిల్ సర్వీసు వ్యవస్థ అధికారంలో ఉన్నవారికి పరిచారికగా...తలాడించడం తప్ప మరేమీ తెలియని అవ్యవస్థగా మిగిలిపోతున్న తీరు నానాటికీ కళ్లకు కడుతోంది. ఆమధ్య సుప్రీంకోర్టు సీబీఐని ‘పంజరంలో చిలుక’గా వ్యాఖ్యానించింది గానీ...ఆ వ్యాఖ్యలు సివిల్ సర్వీస్ వ్యవస్థ మొత్తానికి వర్తిస్తాయని వర్తమాన పరిస్థితులను గమనించే ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.
ఎక్కడో ఒక అశోక్ ఖేమ్కా, ఒక దుర్గాశక్తి నాగ్‌పాల్ కారుచీకట్లో కాంతి పుంజాల్లా మెరుస్తుంటారు. కొడిగడుతున్న ఆశలకు ఊపిరి పోస్తారు. కానీ, చాలామంది సర్దుకుపోదామనుకుంటారు. అందుకు కారణం స్పష్టమే... బదిలీలు! ఎన్నేళ్లయినా తీరు మార్చుకోని కార్యనిర్వాహక వ్యవస్థపై కొరడా ఝళిపిస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఎన్నదగిన తీర్పునిచ్చింది. సివిల్ సర్వీస్ అధికారులను ఇష్టమొచ్చినట్టు బదిలీ చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుచేసింది.
అలాగే, పాలకులిచ్చే మౌఖిక ఆదేశాలను ఇటుమీదట ఔదాల్చాల్సిన అవసరం లేదని, లిఖితపూర్వకంగా ఉంటేతప్ప దేన్నీ పరిశీలించవద్దని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ జయంతి రోజునే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు... పాలనా వ్యవస్థలో నానాటికీ దిగజారుతున్న విలువలను నిలబెట్టేందుకు దోహదపడుతుంది. ప్రామాణికమైన పాలనకు తోవకల్పిస్తుంది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, మరో 82మంది రిటైర్డ్ అధికారులు దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పునిచ్చింది.
పార్టీలతోనూ, పాలకులతోనూ నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీస్ వ్యవస్థను చిన్నచూపు చూసే వైఖరి కొనసాగుతోంది. నిబంధనలను బేఖాతరుచేసి తామనుకున్నదే చలామణి కావాలని చూసే రాజకీయ నాయకత్వానికి ముక్కు సూటిగా వ్యవహరించే అధికారులంటే ఒళ్లు మంట. ప్రతిదానికీ రూల్స్ మాట్లాడితే ఆగ్రహం. అలాంటివారిని పాలకులు ప్రాధాన్యత లేని పదవులకు సాగనంపి కక్ష తీర్చుకుంటారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన భూ లావాదేవీల ఆరా తీసిన అశోక్ ఖేమ్కాను హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్న దుర్గాశక్తిని యూపీలోని అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ ప్రభుత్వం బదిలీచేశాయి.
గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి సంజయ్ భట్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ప్రతి అధికారీ సగటున కేవలం 16 నెలలు మాత్రమే ఒక పదవిలో కొనసాగగలుగుతున్నారని హార్వర్డ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గాల్సిన అవసరం లేదని... సత్యనిష్టతో, నిబద్ధతతో తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలనీ మన అధినేతలు పిలుపునిస్తుంటారు. కానీ, ఆచరణలోకొచ్చేసరికి ఇలాంటి ‘ఉద్బోధ’లన్నీ ఆవిరైపోతాయి. మాటవినని అధికారులకు బదిలీలే బహుమతులవుతాయి. నాలుగేళ్లక్రితం వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పాలనా సంస్కరణల సంఘం సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రక్షాళనకు ఎన్నెన్నో విలువైన సూచనలిచ్చింది.
అధికారులకు ఆయా రంగాల్లో ఉన్న ప్రతిభ, అభినివేశాన్నిబట్టి పోస్టింగ్‌లు ఇవ్వాలని, అటు తర్వాత వారి పనితీరును సమీక్షించి దానికి అనుగుణంగా పదోన్నతులివ్వాలని సూచించింది. నిర్ణీత కాలవ్యవధిలో పదోన్నతులను పంచిపెట్టే ప్రస్తుత విధానానికి స్వస్తి చెప్పాలని తెలిపింది. పనితీరు సక్రమంగా లేనివారికి తగిన సలహాలిచ్చి మారడానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. తీరుమార్చుకోని వారిని, అయోగ్యులుగా తేలినవారిని ఇంటికి సాగనంపాలని స్పష్టంచేసింది. ఈ సూచనలకు అనుగుణంగా వ్యవహరించివుంటే కార్యనిర్వాహక వ్యవస్థకు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎదురైన పరాభవం దాపురించేది కాదు.
సుప్రీంకోర్టు తన తీర్పులో మూడునెలల్లోగా అధికారుల బదిలీకి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని నిర్దేశించింది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీస్ బోర్డు(సీఎస్బీ)లు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ బోర్డులకు కేంద్రంలో కేబినెట్ కార్యదర్శి, రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నేతృత్వంవహించాలని తెలిపింది. ఇకపై ఏ అధికారి ఏ పదవిలో ఉండాలో, ఎవరిని ఎక్కడకు బదిలీచేయాలో, ఎవరిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలో ఈ బోర్డులు నిర్ణయిస్తాయని... వాటి సిఫార్సులను ఆమోదించాలో, తిరస్కరించాలో ప్రధాని లేదా ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటారని, అందుకు గల కారణాలను వారు లిఖితపూర్వకంగా ఇస్తారని తెలిపింది.
సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు వగైరా అంశాలను పొందుపరుస్తూ సివిల్ సర్వీస్ చట్టాన్ని తీసుకురావాలని... ఈలోగా తమ ఆదేశాలనే అమలుచేయాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పు జవాబుదారీతనాన్ని రాజకీయ నాయకత్వంనుంచి అధికారవర్గానికి బదిలీచేసినట్టు కనిపిస్తోంది. ప్రజలద్వారా అధికారంలోకొచ్చే రాజకీయ నాయకత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు అది కీలకం. కానీ, ప్రతిచోటా పాలకులు ఆ జవాబుదారీతనం చాటున అధికారాన్ని దుర్వినియోగం చేశారు. రాజకీయ జోక్యంతో అధికారుల్లోని వృత్తి నైపుణ్యాన్ని, సమర్ధతను దెబ్బతీశారు.
సుప్రీంకోర్టు తీర్పు దాన్ని సరిదిద్దబోతూ కొత్త సమస్యలకు తావిచ్చినట్టు కనిపిస్తోంది. రేపన్నరోజున సీఎస్‌బీలు తమ వైఖరే సరైనదని వాదించి, అధికారుల రక్షణకు పూనుకుంటే... ముఖ్యమంత్రులను బేఖాతరుచేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇవాళ రాజకీయ నాయకత్వాలవల్ల తలెత్తే సమస్యలు రేపు బ్యూరోక్రసీతో తలెత్తబోవన్న గ్యారెంటీ ఏమీ లేదు. మొత్తానికి సివిల్ సర్వీస్ వ్యవస్థ ప్రక్షాళనకు ఒక ప్రయత్నమైతే మొదలైంది. ఆచరణలో రాగల సమస్యలను తీర్చి మరింత మెరుగుపరిస్తే ఈ వ్యవస్థ రూపకల్పనలోని లక్ష్యం నెరవేరుతుంది.