సీబీఐకి చిక్కిన ఇన్‌కంట్యాక్స్ డీసీ
కరీంనగర్: కరీంనగర్ ఇన్‌కం ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయప్రకాశ్ ఓ చిట్‌ఫండ్ వ్యాపారి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్‌లోని సన్నిహిత చిట్‌ఫండ్ నిర్వాహకుడు భూమాగౌడ్‌ను చిట్‌ఫండ్‌కు సంబంధించిన ఇన్‌కంటాక్స్ వ్యవహారంలో జయప్రకాశ్ రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో జయప్రకాశ్‌ను కలిసి రూ.2 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. అప్పటికే మాటు వేసిన సీబీఐ అధికారులు వెంటనే కార్యాలయంపై దాడి చేసి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.