మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో..
Netherlands going into lockdown again amid Omicron అమ్‌స్టర్‌డామ్: నెదర్లాండ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున ఉధృతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్ధేశ్యంతో డచ్ ప్రభుత్వం శనివారం లాక్‌డౌన్‌ను విధించింది. ఈ మేరకు హేగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే ప్రకటించారు.
ఈ నిర్ణయంతో నెదర్లాండ్స్ మరొకమారు లాక్డౌన్లోకి వెళ్తుంది. ‘ఊహించిన దానికంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. అందువల్లనే లాక్డౌన్ తప్పనిసరైంది. కొత్త లాక్డౌన్ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమల్లోకొస్తుంది. కఠిన నిబంధనలతో ఈ లాక్‌డైన్ కొత్త సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్ చేరువ అవుతున్న తరుణంలో లాక్‌డైన్ అనివార్యమైంద'ని రుట్టే తెలిపారు.
సూపర్ మార్కెట్లు, వైద్యపరమైన వృత్తులు, కార్ గ్యారేజీలు వంటి ఇతర ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా ఇతర షాపులు, అన్ని విద్యా సంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. శుక్ర, శని వారాల్లో దాదాపుగా 14,742 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, ఓఎమ్టీ సభ్యుడు జాప్ వాన్ డిసెల్ మీడియాకు తెలిపాడు. అంతేకాకుండా క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
కాగా డిసెంబర్ 14న నెదర్లాండ్స్‌లో కొన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అప్రధాన షాపులకు నైట్లాక్డౌన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించారు. అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులకు ఒక వారం ముందునుంచే పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని ఆదేశించారు. ఐతే ఒమిక్రాన్ అడ్డుకోవాలంటే ఈ ఆంక్షలు సరిపోవని భావించిన డచ్ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే తాజాగా సంపూర్ణ లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది.
చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!!