పెళ్లి ట్రాక్టర్ను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
దువ్వూరు:
శనివారం అర్ధరాత్రి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వూరు మండలం కృష్ణంపల్లెకు చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్లో కడపకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్కు డీజిల్ అయిపోవడంతో రోడ్డు పక్కన ఆపుకొని ఉన్నారు. ఈ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ట్రాక్టర్లో ఉన్న బాలరాజు(40), చిన్నపుల్లయ్య(24), లక్ష్మీప్రసన్న(10) మృతి చెందారు. చిన్నపుల్లయ్యకు ఇటీవల నిశ్చితార్థం అయింది. ట్రాక్టర్లో మొత్తం 20 మంది ఉన్నారు. వారిలో 17 మంది గాయాల పాలయ్యారు. వీరిని ప్రొద్దుటూరు, మైదుకూరులోని ఆస్పత్రులకు తరలించారు. కృష్ణంపల్లెకు చెందిన అమ్మాయికి, ఎర్రగుంట్ల అబ్బాయికి సోమవారం ఉదయం కడపలో వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం అమ్మాయి తరఫు వారు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దువ్వూరు, మైదుకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.