రైలు చార్జీలు పెంచే యోచన
ఉత్తమ సేవలందించాలంటే తప్పదన్న రైల్వే మంత్రి
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు రైల్వే బడ్జెట్
నాలుగు ‘ఎస్’లకు ప్రాధాన్యం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ
దొడ్డబళ్లాపురం : ప్రయాణీకులకు ఉత్తమ సేవలందించాలంటే రైలు చార్జీలు పెంచినా తప్పులేదని, ప్రయాణీకులు కూడా చార్జీల పెంపునకు సముఖంగా ఉన్నారని, అయితే సేఫ్టీ, సర్వీస్, సెక్యూరిటీ కోరుతున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి నీలయ్యకు మద్దతుగా ప్రచారం చేయడానికి పట్టణానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జులై 2వ వారంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనన్నానని చెప్పిన ఆయన ఇప్పటికే బడ్జెట్ తయారీ నడుస్తోందన్నారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పలు విడతలుగా చర్చిస్తున్నానన్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ, సర్వీస్‌కు ప్రాధాన్యతనిస్తానన్న ఆయన వీటికితోడు ప్రయాణీకుల స్పీడ్ కూడా కోరుకుంటున్నారని ఈ దిశలో సేవలందిస్తామన్నారు.
రైల్వే శాఖలో చైనా, జపాన్ దేశాల తరహాలో బుల్లెట్ ట్రైన్ సేవలందించే ఆలోచన ఉందన్న సదానందగౌడ స్థాయిలో సేవలందించాలంటే ఉన్న ఆదాయం సరిపోదన్నారు. దీని కోసం రైల్వే శాఖలోకి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు. అదేవిధ ంగా ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు (ఎఫ్‌డీఐ) అవకాశం కల్పిసామన్నారు.
రైలు సేవలు దేశంలో సామాన్యుడికి మరింత దగ్గరయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. గత రైల్వే మంత్రి ఖర్గే పలు స్టేషన్లలో రైళ్ల నిలుపుదలను రద్దు చేశారని, అయితే వాటిని యథావిధిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని, ఆయా స్టేషన్ల పరిధిలోని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను సంప్రదించి అవసరం మేరకు నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.
హీరేమఠ్ ఆరోపణలు నిరాధారం :
ఎన్సీపీఎన్ఆర్ వ్యవస్థాపకుడు హీరేమఠ్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తీర్పు ఇచ్చిందని సదాసంద గౌడ ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. హీరేమఠ్ తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు.
తగిన సాక్ష్యాధారాలుంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు. అయినా ఆయనకు దేవుడు మంచి చేయాలని, ఆయన పోరాటాలు కొనసాగించాలని కోరుకుంటున్నానని నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరసింహస్వామి, పార్టీ నేతలు కేఎం హనుమంతరాయప్ప, బీసీ నారాయణస్వామి,జోనా మల్లికార్జున్, యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ స్థానిక నేతలు పలువురు హాజరయ్యారు.