ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవోగా రవికుమార్
విజయవాడ (లబ్బీపేట): విజయవాడ ప్రభుత్వాస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (సివిల్ సర్జన్ ఆర్ఎంఓ– ఇన్‌ఛార్జి)గా డాక్టర్ జి.రవికుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సివిల్æసర్జన్ ఆర్ఎంఓగా పనిచేసిన డాక్టర్ గీతాంజలి తిరుపతి రుయాకు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆమె స్థానంలో డిప్యూటీ ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. గీతాంజలి రెండేళ్లపాటు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓగా పనిచేసారు. రవికుమార్ డిప్యూటీ ఆర్ఎంఓగా ప్రభుత్వాస్పత్రిలో తొమ్మిదేళ్లుగా పనిచేయడంతో ఇక్కడి పరిస్థితులపై పట్టుంది. ఆస్పత్రిపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్ రవికుమార్‌ను ఈ మేరకు నియమిస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ జగన్మోహనరావు ఆదేశాలు ఇచ్చారు. శనివారం సాయంత్రం గీతాంజలి రిలీవ్‌కాగా, రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు.