హృదయ స్పందనలను తెలిపే ‘స్టిక్’
హుబ్లీ పాలిటెక్నిక్ విద్యార్థుల వినూత్న సృష్టి
సాక్షి, బెంగళూరు: విద్యార్థులు వినూత్న ఆలోచనలతో అంధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడవడానికి ఉపయోగపడే కర్రను (ఈ-బ్లైండ్ స్టిక్)ను తయారు చేశారు. అంతేకాకుండా ఆ కర్రను వాడే వారి హృదయ స్పందనల్లో తేడా వచ్చిన వెంటనే సంబంధీకులకు తెలియజేసే వ్యవస్థను సదరు కర్రలో పొందుపరిచారు. హుబ్లీలోని మునివళ్లీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాహుల్, ఎస్. కిషన్ గౌరన్నవర్, కె. విట్టల్ తలవార్, సంజీవ్ ఎస్. దేశ్‌పాండే, ఎస్.బీ యాద్వాడ్, సునీల్ తమ ప్రాజెక్టులో భాగంగా ఈ-బ్లైండ్ స్టిక్‌ను రూపొందించారు.
అంధులు నడుచుకుని వెళ్లే సమయంలో ఏమైనా అడ్డం వస్తే ఆ విషయాన్ని ఈ స్టిక్ ధ్వని రూపంలో తెలియజేస్తుంది. ఇందుకు ఈ-బ్లైండ్‌స్టిక్ తయారీలో వినియోగించిన ప్రత్యేకమైన ఇయర్‌ఫోన్స్ ఉపయోగపడతాయి. దీని తయారీలో వినియోగించిన అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా స్టిక్‌ను వాడుతున్న వ్యక్తి హృదయ స్పందనలో విపరీతమైన మార్పులు (గుండెపోటు) వస్తే వెంటనే విషయాన్ని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), గ్లోబల్ సిస్టం ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ (జీఎస్ఎం) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముందుగా నిర్ణయించిన కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది.
అంతేకాకుండా బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారన్న విషయం కూడా క్షణాల్లో చేరిపోతుంది. మైసూరులో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యా రంగ నిపుణులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తల ప్రశంసలను ఈ-బ్లైండ్ స్టిక్ అందుకుంది.