15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఆఫీస్ సేవలు
విజయవాడ : రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ప్రధాన శాఖల ఫైళ్లన్నీ మే 15 నుంచి ఈ-ఆఫీస్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యదర్శి పి.ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. 11 జిల్లాల నుంచి వచ్చిన 114 మంది డి.ఎ.ఒ., లోకల్ అడ్మిన్లకు చెందిన సిబ్బందికి గురువారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పూర్తిస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ నిర్వహించారు. ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ఈ-గవర్నెన్స్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. ఈ-ఆఫీస్ విధానంలో సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకతతో కూడిన పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఆవరణలో రాష్ట్రస్థాయి ఈ-ఆఫీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.
పరిపాలన అటు హైదరాబాద్‌లోను, ఇటు విజయవాడలోను నిర్వహిస్తున్నందున ఫైళ్లను మోసుకెళ్లే భారం లేకుండా ఈ-ఆఫీస్ ద్వారా సమర్ధవంతమైన పరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ-ఆఫీస్ నిర్వహణపై కలెక్టర్ శిక్షణ ప్రాథమిక దశలో ఈ-ఆఫీస్ నిర్వహణ అసాధ్యమని, అయినా కష్టపడితే ఫలితం ఉంటుందని కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. జిల్లాలో అమలవుతున్న ఈ-ఆఫీస్ విధానాన్ని ఆయన శిక్షణ ద్వారా సిబ్బందికి వివరించారు. ప్రతి జిల్లాలో ఆయా శాఖల పరిధిలో ఈ-ఆఫీస్ నిర్వహణకు పది మంది సిబ్బందితో, జిల్లాలో వారి పరిధిలో అన్ని శాఖలకు చెందిన సిబ్బంది, ఆర్గనైజింగ్ యూనిట్ల ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఫైళ్లను సమర్ధంగా నిర్వహించేలా త్వరలో చర్యలు చేపడతామన్నారు.