ఇదేనా.. ఈ- పంచాయ(యి)తీ
అమలుకు ఆమడదూరం
కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం నిల్
సర్టిఫికెట్లు ఇవ్వలేని తీరు
ప్రస్తుతం అకౌంట్ల నమోదుకే పరిమితం
970కు గానూ... 344 పంచాయతీలకే....
జనన మరణ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో...ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఈ పంచాయతీ’ బాలారిష్టాలు దాటలేదు. నాలుగు నెలల క్రితమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ... మొదటి దశ పంచాయతీలే ఇంకా పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. ప్రతి పత్రం ఆన్లైన్ ద్వారా అందిస్తామని చెప్పిన అధికారులు... ఇప్పటి వరకు కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యమే కల్పించలేదు. దీంతో ఆపరేటర్లు ఖాళీగా ఉంటూ వేతనాలందుకుంటున్నారు.
గుడివాడ : గ్రామ పంచాయతీల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈపంచాయతీలు అలంకార ప్రాయంగా మారాయి. ఈ పంచాయతీ ద్వారా ధ్రువీకరణ పత్రాల జారీకి కావాల్సిన సాఫ్టు వేర్‌ను ఇంతవరకు రూపొందించలేదని తెలుస్తోంది. ఒక్కో పంచాయతీకి రూ.1.50లక్షల వ్యయంతో కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, యూపీఎస్, బ్రాడ్‌బ్యాండు సౌకర్యం కల్పించారు. అయితే కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండు అందుబాబులో లేకపోవటంతో పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లకు పని లేకుండాపోయింది.
జిల్లాలో 546 ఈ-పంచాయతీలు...
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మేలైన పాలన అందించే పేరుతో ఈఏడాది జూలైలో ఈ- పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీలుండగా... వాటిలో క్లష్టర్ పంచాయతీలుగా ఉన్న 546 గ్రామ పంచాయతీల్లో ఈ- పంచాయతీ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అయితే 362 గ్రామ పంచాయతీల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసి తాత్కాలిక పద్ధతిపై ఆపరేటర్లను నియమించారు. ఇంకా 184 క్లష్టర్ పంచాయతీల్లో ఇందుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయని పంచాయతీ సర్పంచులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ బ్రాండ్ బ్యాండ్ ఇక్కట్లు....
ఈ- పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన 362 గ్రామ పంచాయతీల్లో దాదాపు 20చోట్ల ఇంటర్నెట్ సౌకర్యంలేక కంప్యూటర్లు పనిచేయడంలేదు. క్లష్టర్ పంచాయతీకి దగ్గర్లో ఉండి నెట్ సౌకర్యం ఉన్న పం చాయతీల్లోకి కంప్యూటర్లు మార్చుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులు సూచించారు. దీంతో గుడివాడ రూరల్ మండలంలోని సీపూడి, రామనపూడి పంచాయతీల్లోని కంప్యూటర్లును వేరో పంచాయతీకి మారుస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ధ్రువీకరణ పత్రాల సాఫ్ట్వేర్ ఏదీ?...
ఈ- పంచాయతీల నిర్వాహణ పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూషనల్ అకౌంటింగ్ (పీఆర్ఐఏ) సాఫ్ట్వేర్ ద్వారా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో 2011నుంచి ఉన్న అకౌంట్స్‌ను ఆన్లైన్ చేస్తున్నారు. జమా ఖర్చులు బిల్లులు వంటివి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా ఏఏ పంచాయతీ ఏపనికి ఎంత బిల్లు చెల్లించిందో ఆన్లైన్ ద్వా రా తెలుస్తుంది. ఈ- పంచాయతీ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి విలువ పత్రాలు, ఆస్తిపన్ను వసూళ్ల ఎంట్రీలు, వివిధ శాఖల డేటా ఎంట్రీలు, చేయాల్సి ఉంది. నాలుగు నెలలు దాటినా ఈ తర హా సేవలు ఎక్కడా ప్రారంభించలేదు.
నెలరోజుల్లో అన్ని సేవలు అందిస్తాం..
మరో నెల రోజుల్లో ఈ-పంచాయతీల్లో అన్ని సేవ లూ అందిస్తాం. ఇప్పటికే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అందుబాటులో లేని చోట్ల వేరే ప్రాంతానికి కం ప్యూటర్లు మారుస్తున్నాం. ఇకపై ప్రపంచంలో ఎక్క డ ఉన్నా వారి జనన మరణ ధ్రువీకరణ పత్రాలు పొందే అవకాశం ఉంది. రెండవ ఫేజ్‌లో అన్ని పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మారుస్తాం.
- వరప్రసాద్, డీఎల్పీవో, గుడివాడ.