జేసీ బదిలీ.. డిప్యూటి కలెక్టర్లకూ స్థానచలనం
హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన జేసీ శ్రీధర్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. అలాగే ఈ స్థానంలో వేరెవరినీ ప్రభుత్వం నియమించలేదు. జాయింట్ కలెక్టర్ విధులను కూడా జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనాకే (అదనపు బాధ్యతలు) అప్పగించారు. బదిలీ అయిన జేసీ శ్రీధర్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అయితే.. మంగళవారం జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా కూడా సెలవు పెట్టడంతో ఇంచార్జి కలెక్టర్‌గా, ఇంచార్జి జేసీగా కూడా ఏజేసీ సంజీవయ్య వ్యవహరించారు.
జేసీగా మంచిపేరు ..
హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా 2012 మే 2న బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ రెండేళ్ల పాటు జిల్లాకు విశేషమైన సేవలందించారు. రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మండలాల వాగా ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వివరాల సేకరణ, ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులను అప్డేట్ చేసేందుకు.. అన్ని మండలాల తహశీల్దార్లకు ట్యాబ్లెట్ పీసీలను సమకూర్చారు. జిల్లాకు కలెక్టర్లుగా పనిచేసిన నటరాజన్ గుల్జార్, సయ్యద్ ఆలీ ముర్తుజా రిజ్వీ, ముఖేశ్ కుమార్ మీనా ఉన్నపుడు జేసీగా శ్రీధర్ కీలకమైన అంశాల్లో మంచి సహకారాన్ని అందించారు. శ్రీధర్‌కు త్వరలోనే పదోన్నతిపై మెదక్ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ దక్కవచ్చని తెలిసింది.
డిప్యూటి కలెక్టర్లు బదిలీ
హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆర్.అంజయ్యను ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్డీఓగా బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.మాసుమ బేగం కూడా బదిలీ అయ్యారు. అయితే తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం ప్రత్యేక అధికారిగా ఉన్న వి.ఆనందరావును తార్నాకలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కార్యాలయానికి స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. యూఎల్సీ స్పెషలాఫీసర్‌గా పోస్టింగ్ కోసం వేచి ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సత్తయ్యను ప్రభుత్వం నియమించింది.