మళ్లీ ఇ-సువిధ..!
* కొత్త పేరుతో ముందుకు..
* అన్ని పురపాలికల కంప్యూటరీకరణ
* ఆన్లైన్ ద్వారా అందుబాటులో సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కంప్యూటరీకరించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ యోచిస్తోంది. దీనికోసం మళ్లీ ‘ఇ-సువిధ’ ప్రాజెక్టుకు దుమ్ము దులుపుతోంది. పురపాలికల కంప్యూటరీకరణ కోసం గతంలో అమలు చేసిన ఈ-సువిధనే మళ్లీ పునరుద్ధరించాలా? లేక కొన్ని మార్పులతో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాలా? అన్న అంశంపై ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి.
ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 2004లో సువిధ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజలనుంచి అంతగా స్పందన రాకపోవడంతో పూర్తిగా అమలు కాకముందే మరుగున పడిపోయింది. మళ్లీ ఈ ప్రాజెక్టుకు జవసత్వాలు నింపాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు కొత్త పేరు పెట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 69 పురపాలికల్లో అమలుచేయడానికి రూ. 30.99 కోట్లు ఖర్చవుతుందని కన్సల్టెన్సీ నివేదించింది.
దీంతో అమలుకు అనుమతులు జారీ చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాద నలు వెళ్లాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, శాఖ కమిషనర్, డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ అనితా రామచంద్రన్, ఏపీఎండీపీ ప్రాజెక్టు డెరైక్టర్ కె. నిర్మల శనివారం సమావేశమై ఈ ప్రాజెక్టు విధివిధానాల ఖరారుపై చర్చించారు.