మరో 37 దేశాలకు ఇ-వీసాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించి, పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఎలక్ట్రానిక్ వీసా ప్రోగ్రామ్‌లో మరో కీలక అడుగు పడింది. మరో 37 దేశాలకు ఈ-వీసా సౌకర్యాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం, అల్బేనియా, ఆస్ట్రియా, ఘనా, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జాంబియా, జింబాబ్వే సహా మొత్తం 37 దేశాలకు ఈ- వీసా కల్పించారు. దీంతో ఈ సౌకర్యాన్ని పొందిన మొత్తం దేశాల సంఖ్య 150 కు చేరినట్టయింది.
ప్రస్తుతం దీని ద్వారా రోజుకు సగటున 3,500 టూరిస్ట్ వీసాలను జారీచేస్తున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఏడున్నర లక్షల వీసాలను ప్రాసెస్ చేసినట్టు తెలిపింది. 2014 నవంబర్‌లో లాంచ్ చేసిన ఈ ప్రతిష్టాత్మక పథకంలో మొదటిదశలో అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్‌తోపాటు 43 దేశాలకు చెందిన పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యం కల్పించారు.
భారత్‌లో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నదే తమ ఏకైక లక్ష్యమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇ - వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లోగా టూరిస్ట్ వీసా అందిస్తామని, కొన్ని ‘ప్రమాదకర’ దేశాలు మినహా అన్ని దేశాల పర్యాటకులకు దశలవారీగా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తామని కేంద్రమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.