రజినీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
చెన్నై: తమిళులకు ఆరాధ్యుడైన సంస్కరణవాది ఈవీ రామస్వామి పెరియార్‌కు సంబంధించి సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రజినీకి మద్దతిచ్చే, వ్యతిరేకించే వర్గాలుగా తమిళ రాజకీయాలు విడిపోయాయి. ద్రవిడ సైద్ధాంతిక పార్టీలు, సంస్థలు రజినీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం రజినీకి మద్దతుగా నిలిచింది. రజినీకాంత్ కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని బుధవారం పెరియార్ స్థాపించిన ద్రవిడార్ కజగం సంస్థ అధ్యక్షుడు వీరమణి వ్యాఖ్యానించారు. మతవాద శక్తుల చేతిలో పావుగా మారొద్దని కాంగ్రెస్ ఈ సినీ సూపర్‌స్టార్‌కు హితవు చెప్పింది. రజినీ ఇంటి దగ్గరలో ద్రవిడార్ విదుతలై కచ్చి సభ్యులు ధర్నా నిర్వహించారు. పెరియార్ సిద్ధాంతాలను ఎవరూ తప్పుబట్టలేరని అధికార అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు. పెరియార్ విషయంలో ఆలోచించి మాట్లాడాలని డీఎంకే పేర్కొంది.