రోడ్డున్న ప్రతి గ్రామానికీ బస్సు
కాచిగూడ: ప్రజల సహకారంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల భాటలో నడిపించే విధంగా కృషి చేస్తామని ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్లు, అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రతి నెలా రూ.75కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తోందని అన్నారు. రోడ్డున్న ప్రతి గ్రామానికీ బస్సును నడిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు మరిన్ని ఎక్కువ ప్రాంతాలను కలుపుతూ బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. రూ.230 కోట్లతో 1157 కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కాలనీల నుంచి కాలనీలకు, గ్రామీణ ప్రాంతాల్లో 236 మిని బస్సులను నడుపుతామని అన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.5వేల కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యంతో అందరం కలిసి కట్టుగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్, రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్రావు, డివిజనల్ మేనేజర్ వరప్రసాద్, బర్కత్‌పుర డిపో మేనేజర్ శంకర్, కాచిగూడ డిపో మేనేజర్‌తో పాటు పలు డిపోల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మెన్ హరితహారంలో భాగంగా బస్టాండులో మొక్కలు నాటారు.