eamcet-2015
-
భద్రత కల్పించలేం : తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం నెలకొంది. ఏపీ ఎంసెట్‌కు ఆ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెంటర్లు కేటాయించింది. అయితే ఆ ఎంసెట్‌తో తమకు సంబంధంలేదని, భద్రత కల్పించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంసెట్ నిర్వహణకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం, డీజీపీలకు ఏపీ ఉన్నత విద్యామండలి లేఖలు రాసింది. ఈ వివాదంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. -
ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్
కాకినాడ: మే 8న ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్, ఎంసెట్ చైర్మన్ డాక్టర్ వీఎస్ఎస్ కుమార్ చెప్పారు. హైదరాబాద్‌లో 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు రెండు లక్షల 54 వేల 523 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌కు 355 పరీక్షా కేంద్రాలు, మెడికల్‌కు 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కుమార్ వివరించారు. -
6 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
చివరి తేది ఏప్రిల్ 11 మే 8న పరీక్ష, 26న ఫలితాలు కాకినాడ: మే 8న నిర్వహించనున్న ఎంసెట్-2015 పరీక్షకు ఈ నెల 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కన్వీనర్ సీహెచ్. సాయిబాబు బుధవారం తెలిపారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 11. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు, రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఏప్రిల్ 22వరకు, రూ. ఐదువేల అపరాధ రుసుంతో మే 2 వరకు, రూ.పదివేల అపరాధ రుసుంతో మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తులో మార్పులు చేర్పులు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు చేసుకోవచ్చన్నారు. ఒక విద్యార్థి ఒకసారి మాత్రమే దరఖాస్తు చేయాలని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూ. 250 ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లలో క్రెడిట్, డెబిట్, మ్యాస్ట్రో కార్డుల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్, మెడిసిన్ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసేవారు రూ. 500 ఫీజు చెల్లించాలని చెప్పా రు. ప్రస్తుతం ఉన్న 17 రీజనల్ కేంద్రాలతోపాటు ఈ ఏడాది కొత్తగా విశాఖ జిల్లా అనకాపల్లి, గుంటూరు జిల్లా నరసారావుపేట, కర్నూలు జిల్లా నంద్యాల, వైఎస్పార్ కడప జిల్లా ప్రొద్దుటూరుల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 2 నుంచి 6 వరకు హాల్ టిక్కెట్లను ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎపీఎంసెట్.ఒఆర్జి’ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 8న ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలకు, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30కు నిర్వహిస్తామన్నారు. ఫలితాలు మే 26న విడుదల చేయనున్నట్టు చెప్పారు. సందేహాల నివృత్తికి 0884-2340535లో సంప్రదించాలన్నారు. -
'ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు'
విజయవాడ : ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుందని విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. ఇంటర్ మార్కులు ఆధారంగానే ఎంసెట్ అడ్మిషన్లు జరపాలని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఒకవేళ ఏపీలో ఎంసెట్ నిర్వహించినా అడ్మిషన్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని హరిబాబు సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ వ్యవహారాన్ని గాలికొదిలేసింది. ఎంసెట్ ఉమ్మడిగా నిర్ణయించాలా..? లేక ప్రత్యేకంగా నిర్వహించాలా...? అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఉమ్మడి ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వంలోనూ చర్చించడమూ లేదు. ప్రత్యేకంగా నిర్వహణకు ఏపీ సర్కార్ సిద్ధమవటంలేదు. లక్షలాదిమంది విద్యార్థులను ప్రభుత్వం గందరగోళంలో పడేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనుంది. 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన పరీక్షను నిర్వహించి.. అదే నెల 28వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు.