
'ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు'
విజయవాడ : ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుందని విశాఖ బీజేపీ ఎంపీ హరిబాబు అభిప్రాయపడ్డారు. ఇంటర్ మార్కులు ఆధారంగానే ఎంసెట్ అడ్మిషన్లు జరపాలని ఆయన శనివారమిక్కడ అన్నారు. ఒకవేళ ఏపీలో ఎంసెట్ నిర్వహించినా అడ్మిషన్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని హరిబాబు సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ వ్యవహారాన్ని గాలికొదిలేసింది. ఎంసెట్ ఉమ్మడిగా నిర్ణయించాలా..? లేక ప్రత్యేకంగా నిర్వహించాలా...? అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఉమ్మడి ఎంసెట్పై తెలంగాణ ప్రభుత్వంలోనూ చర్చించడమూ లేదు. ప్రత్యేకంగా నిర్వహణకు ఏపీ సర్కార్ సిద్ధమవటంలేదు. లక్షలాదిమంది విద్యార్థులను ప్రభుత్వం గందరగోళంలో పడేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ చేయనుంది. 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 14వ తేదీన పరీక్షను నిర్వహించి.. అదే నెల 28వ తేదీన తుది ఫలితాలను వెల్లడిస్తారు.