రేపటి నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు
15వ తేదీన పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఎంసెట్ కన్వీనర్ రమణరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15న ఎంసెట్-2016 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించామని, అయితే తల్లిదండ్రులు, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లి చూసి వచ్చేందుకు వీలుగా ఈ నెల 9 నుంచే హాల్ టికెట్లను తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం జేఎన్టీయూహెచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమయానికి గేట్ లోపలికి వస్తే చాలు
మొత్తం 468 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హైస్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పోలీసు అకాడమీ వంటి శిక్షణ సంస్థల్లోనే ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందుగానే అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించరు. అయితే పరీక్ష కేంద్రం గేట్‌ను కటాఫ్‌గా తీసుకుంటారు. గేట్ లోపలికి ఉదయం పరీక్ష కోసం 10 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష కోసం 2:30 గంటలకు వచ్చిన వారిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
ఈ నిబంధన ఉన్నందున విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, తర్వాత ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఈ సారి కొత్తగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సమాచారాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ ఇతర అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిబంధన విధించారు.
వెబ్సైట్లో ఓఎంఆర్ జవాబు పత్రం
ఎంసెట్ పరీక్ష నిర్వహించిన రోజే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఓఎంఆర్ జవాబు పత్రాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. కీలోని అంశా లు, ఓఎంఆర్ జవాబు పత్రాల్లోని అంశాల్లో తేడాలు ఉంటే ఛాలెంజ్ చేయవచ్చు. ఓఎంఆర్ కార్బన్‌లెస్ కాపీ ఈసారి ఇవ్వడం లేదు.
ఏపీకి ఇక్కడి నుంచి స్పెషల్ అబ్జర్వర్లు
ఏపీలో నిర్వహించే పరీక్షకు అక్కడి అధికారులు అబ్జర్వర్లుగా ఉండటంతోపాటు ఇక్కడి నుంచి స్పెషల్ అబ్జర్వర్లను పంపిస్తారు. ఏపీలో పరీక్ష నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 నుంచి 500 మందికి పరీక్ష ఉంటుంది.
విద్యార్థులూ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఒకసారి పరీక్ష హాల్లోకి వస్తే పరీక్ష పూర్తయ్యేంత వరకు బయటకు పంపించరు. పరీక్ష ప్రారంభమైన తర్వాత టాయిలెట్‌కు వెళ్లాలన్నా కుదరదు. ఇక పరీక్ష హాల్లోనే విద్యార్థులకు అర లీటర్ వాటర్ బాటిళ్లను అందజేస్తారు. హాల్‌టికెట్లను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలి. లేదంటే హాల్లోకి అనుమతించరు. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ జవాబు పత్రం, పూర్తి చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం పరీక్ష హాల్లో అందజేయాలి. లేదంటే వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు.
ఓఎంఆర్ జవాబు పత్రం ఇవ్వకుండా తీసుకెళ్లే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. సాధారణ బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవాలి. క్యాలిక్యులేటర్లు, వాచీలు, పేజర్లు, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేస్తారు. బ్లూటూత్, స్పైకెమెరాలు, కెమెరాలు కలిగిన అద్దాలతో వచ్చే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంలోని ఫొటోపై సంబంధిత ప్రిన్సిపల్/గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయించాలి.