EAMCET question paper leak
-
‘ఎంసెట్’ కేసులో కొరియర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ అధికారులు మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన అఖిలేశ్ అలియాస్ బాబును 2 రోజులక్రితం సీఐడీ అరెస్ట్ చేసినట్టు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఎఫ్ఐఆర్లో అఖిలేష్ ఏ28 నిందితుడిగా ఉన్నాడు. ఎంసెట్ కేసులో ప్రశ్నపత్రంపై శిక్షణ ఇచ్చేందుకు విద్యార్థులను 6 ప్రధాన నగరాలకు క్యాంపు గా తీసుకెళ్లారు. ఈ క్యాంపు కేంద్రాలకు అఖిలేష్ ప్రశ్నపత్రాలను తరలించేందుకు కొరియర్‌గా వ్యవహరించినట్టు గతంలో అరెస్టయిన నిందితులు విచారణలో వెల్లడించారు. దీనితో అఖిలేష్ కదలికలపై నిఘాపెట్టిన సీఐడీ అధికారులు ఎట్టకేలకు బిహార్‌లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారులోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌నుంచి రావత్ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చిన కమిలేష్కుమార్సింగ్, అఖిలేశ్ ద్వారా అన్ని శిక్షణ కేంద్రాల్లోని క్యాంపులకు పంపించినట్టు వెలుగులోకి వచ్చింది. దీనితో అఖిలేశ్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు క్యాంపులు నిర్వహించిన బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, షిరిడీ, పుణేలోని లాడ్జీలను పరిశీలించనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అఖిలేష్‌ను తీసుకెళ్లనున్నట్టు కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. క్యాంపుల్లో ప్రశ్నపత్రం అందజేసి అక్కడి నిర్వాహకుల నుంచి, విద్యార్థుల వద్ద వసూలు చేసిన డబ్బు, ఒరిజినల్ సర్టిఫికెట్లను కమిలేష్కుమార్కు అందించినట్టు విచారణలో బయటపడింది. మరో 16మంది కోసం వేట... ఈ కేసులో సీఐడీ 88 మందిని నిందితులుగా గుర్తించింది. వీరిలో కీలక పాత్ర పోషించిన 18 మందిని అరెస్ట్ చేసిన సీఐడీ, 44 మంది బ్రోకర్లను సైతం కటకటాల్లోకి పంపించింది. కీలక పాత్రధారులకు అనుచరులుగా ఉంటూ స్కాంలో పాత్ర పోషించిన మరో 16 మందిని సైతం కటకటాల్లోకి నెట్టేందుకు సీఐడీ వేట సాగిస్తోంది. వీరంతా బిహార్, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీకి చెందిన వారుగా అనుమానిస్తోంది. వీరికోసం వివిధ ప్రాంతాల్లో వేట సాగిస్తున్నట్టు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. -
బహదూర్ చిక్కాడు..
ఎంసెట్ లీకేజీ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ - ఎస్బీ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ - ఢిల్లీలో నాలుగు రోజుల పాటు ఆపరేషన్ సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక నిందితుడు ఎస్బీ సింగ్(బహదూర్‌సింగ్)ను ఎట్టకేలకు సీఐడీ అరెస్ట్ చేసింది. నాలుగు రాష్ట్రాల్లో ఆరు నెలల పాటు వేట సాగించిన సీఐడీ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఓ గెస్ట్‌హౌస్‌లో సింగ్‌ను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ శివారులోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి రెండు సెట్ల ప్రశ్నపత్రాలను బయటకు తీసుకువచ్చిన ఎస్బీ సింగ్ కోసం నాలుగు రోజల పాటు ఆపరేషన్ సాగించిన సీఐడీ ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసింది. యూపీకి చెందిన ఓ పార్టీ నేతలు ఎస్బీ సింగ్ అరెస్ట్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. దీంతో సీఐడీ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి సంబంధిత నేతలతో సింగ్ అరెస్ట్ విషయంపై చర్చించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడని, అరెస్ట్ చాలా కీలకమైనదని, చార్జిషీట్ దశలో ఉన్న కేసులో ఎస్బీ సింగ్‌ను తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. దీంతో సింగ్ ఆచూకీ చెప్పారని, ఢిల్లీలో షెల్టర్ తీసుకున్న గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక చార్జిషీట్‌కు రంగం సిద్ధం.. గతేడాది ఆగస్టులో మొదలైన విచారణలో బ్రోకర్లు, కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీఐడీ ఇక చార్జిషీట్ దాఖలుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు కీలక నిందితుడిగా ఉన్న ఎస్బీ సింగ్ విచారణ పూర్తి చేసి, ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ బయటకు ఎలా తెచ్చారు? ఆ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రాలు ముద్రిస్తు న్న విషయం ఎవరి ద్వారా తెలుసుకున్నారు? మొత్తం డీల్ విలువ ఎంత? యూనివర్సిటీ అధికారుల పాత్ర ఉందా? అన్న అంశాలపై క్లారిటీ తీసుకోనున్నారు. సింగ్ విచారణలో వెల్లడించిన అంశాలను బట్టి ఎఫ్ఐఆర్లో నిందితుల వరుస క్రమాన్ని మార్చాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. వారం పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 61 మంది బ్రోకర్లు.. లీకేజీ కేసు అనేక మలుపులు తిరిగినా సీఐడీ ముందు నుంచి ఒకే దూకుడును ప్రదర్శించింది. తమ పిల్లల సీట్ల కోసం బేరానికి వెళ్తే ఏకంగా ప్రశ్నపత్రాలనే ఇచ్చి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను కటకటాల్లోకి నెట్టింది. ప్రశ్నపత్రాలపై శిక్షణ ఇచ్చిన కమిలేశ్ కుమార్ సింగ్‌తో పాటు మొత్తం 61 మంది బ్రోకర్లను అరెస్ట్ చేసింది. అయితే విచారణలో గుండెపోటుతో కమిలేశ్ కుమార్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం కీలక నిందితుడైన ఎస్బీ సింగ్ కోసం వేట సాగించిన సీఐడీ ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగింది. -
ఎంసెట్ స్కాంలో చార్జిషీట్..!
⇒ దాఖలుకు సిద్ధమవుతున్న సీఐడీ ⇒ ఇప్పటికీ చిక్కని కీలక నిందితులు ⇒ దొరికాక అనుబంధ చార్జిషీట్ దాఖలుకు యోచన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు సీఐడీ చేసిన దర్యాప్తులో మొత్తం 81 మంది బ్రోకర్లు ప్రశ్నపత్రం లీకేజ్‌లో పాత్ర వహించినట్టు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా 56 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. లీకేజ్‌కు సంబంధించి కోల్‌కతా, ముంబై, పుణే, ఢిల్లీ, షిరిడీ, కటక్, బెంగళూరుల్లో క్యాంపులు ఏర్పాటుచేసి విద్యార్థులకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలపై శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రశ్నపత్రం విద్యార్థులకు అందించి ఆరు ప్రాంతాల్లో క్యాంపులు నడిపిన కీలక నిందితుడు కమిలేశ్ కుమార్‌సింగ్ సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతి చెందాడు. ఇతడికి ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం ఇచ్చింది ఎవరో సీఐడీ ఇప్పటికే గుర్తించినా అరెస్ట్ చేయలేకపోయింది. కమిలేశ్ మృతితో పంజాబ్‌కు చెందిన డ్రోంగీ అలియాస్ ఎస్పీ సింగ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతడితో పాటు మరో 8మంది బ్రోకర్లు పట్టుబడితే కేసు దర్యాప్తు పూర్తయినట్టే అని సీఐడీ భావిస్తోంది. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై చార్జిషీట్ దాఖలు చేసి, తదుపరి నిందితులు దొరికిన తర్వాత అనుబంధ చార్జిషీట్ వేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.