Earth expats
-
నయీంలానే కేసీఆర్ సర్కార్ !
-
నయీంలానే కేసీఆర్ సర్కార్ !
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యాంగ్‌స్టర్ నయీం భూములు గుంజుకున్నట్లు కేసీఆర్ సర్కార్ కూడా భూములు లాక్కుంటున్నదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం భూ నిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రాజెక్టులు అవసరమే కానీ వాటికి పక్కా ప్రణాళిక ఉండాలి, ప్రజలతో సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో నిపుణులతో చర్చించి ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి లేదంటే ప్రాజెక్టులను వెంటనే ఆపాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మెట్టు దిగిరాకపోతే వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాకు రైతులు భారీసంఖ్యలో హాజరు కావాలని కోరారు. రెవెన్యూ సెక్రటరికీ, సీఎస్‌కు, డిప్యూటీ సీఎంకు భూసేకరణ కమిషనర్‌కు జేఏసీ డిక్లరేషన్ కాపీని అందచేస్తామన్నారు. ఈ సదస్సులో ప్రకటించిన తీర్మానాలు 1.రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు, పరిశ్రమలకు దౌర్జన్యంగా భూములు తీసుకోవద్దు. దబాయింపులతో భూములను గుంజుకునే విధానానికి స్వస్తిచెప్పాలి. 2. డీపీఆర్ లేకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులకోసం భూములు తీసుక్కోవద్దు. 3.నష్టపరిహారం ప్రజలు కోరుకున్నట్లు ఇవ్వాలి. భూమికి భూమి సేకరించి సర్కారే ఇవ్వాలి. డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటామంటే కుదరదు. 4. భూములు కోల్పోయో రైతులతో పాటు వాటిపై ఆధారపడే వృత్తి దారులకు పరిహారం ఇవ్వాలి. 5. ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు ఆ ప్రాజెక్టుల ప్రయోజనాల్లో భాగస్వాములను చేయాలి. 6. 2013 జాతీయ భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. 7.అన్ని రకాల భూములకు ఏవిధమైన తేడా లేకుండా పరిహారం ఇవ్వాలి. -
ఎమ్మెల్యే ఆదికి శృంగభంగం
సాక్షి ప్రతినిధి, కడప: ఎమ్మెల్యే ఆదికి మరోమారు శృంగభంగం తప్పలేదు. ఏసీసీ యాజమాన్యానికి వత్తాసుగా నిలవడాన్ని ప్రజలు ప్రతిఘటించారు. నిర్వాసితులు పక్షం రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా యంత్రాంగం అర్థం చేసుకోని ఫలితం శుక్రవారం తేటతెల్లమైంది. ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓలను సమావేశంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెరశి శుక్రవారం పర్యావరణశాఖ జరపతలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు వాయిదా పడింది. ప్రజాందోళనను అర్థం చేసుకొని పరిష్కారం మార్గం చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఏసీసీ యాజమాన్యం ఇరువై ఏళ్లుగా పరిశ్రమ నెలకొల్పలేదు. భూనిర్వాసితులం అన్యాయం అయ్యాం. ఉద్యోగాలు వస్తాయంటే భూములు ఇచ్చాం. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నా నష్టపరిహారం లేదు. ఇరువై ఏళ్లు కిందట నామమాత్రపు ధరలతో భూములు చేజేక్కించుకున్నారు. సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకి లేదు. నిర్వాసితుల పరిస్థితి ఏమిటో తేల్చండి. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, పరిహారం ఎంత అప్పగిస్తారు? ఇలాంటి ప్రశ్నలు పక్షం రోజులుగా ఏసీసీ భూనిర్వాసితులు నుంచి విన్పిస్తున్నాయి. నిర్వాసితుల పక్షాన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిలవాల్సి ఉండగా ఇంతకాలం ‘నిమ్మకు నీరెత్తినట్లుగా’ ఉండిపోయారు. పైగా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వ్యక్తి సైతం అప్పట్లో డబ్బులు తీసుకొనే కదా? భూములిచ్చిందని నిర్లక్ష్యపు సమాధానం వెల్లడించడం. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో అధికారం ఓవైపు, ప్రజాపక్షం మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు ప్రాంగణంలో తిష్టవేశాయి. ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షానా నిలవాల్సిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైతం ఏసీసీ యాజమాన్యంకు వత్తాసుగా నిలిచారు. ఆమేరకే నిర్వాసితుల నుంచి ప్రతిఘటన వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేను అడ్డుకున్న ప్రజానీకం.... మైలవరం మండలం వద్దిరాల, గొల్లపల్లె, ఉప్పలపాడు, చిన్నవెంతుర్ల, బెస్తవేముల, జంగాలపల్లె గ్రామాలల్లో సుమారు 3వేల ఎకరాల భూములను ఏసీసీ యాజమాన్యం సిమెంటు పరిశ్రమ కోసం 1996లో సేకరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పరిశ్రమ నెలకొల్పలేదు. తాజాగా పర్యావరణశాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందుకు సమాయత్తమైంది. ఈనేపధ్యంలో నిర్వాసితులు తాము ఇంతకాలం నష్టపోయాం, ఇప్పుడు మాపరిస్థితి ఏమిటి? ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? పరిహారం మాటేమిటీ? అంటూ చేతులు కలిపారు. వారి సందేహాలను ప్రజాప్రతినిధిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఆదిపై కూడ ఉందని విశ్లేషకుల భావన. కాగా ప్రజాభిప్రాయసేకరణకు మద్దతుగా ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యానించడం, అధికారులను సదస్సు నిర్వహించాలని చెప్పడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సదస్సులోకి వెళ్లకుండా నిర్వాసితులు గేటువద్దే అడ్డుకున్నారు. మెయిన్‌గేటు వద్ద నిర్వాసితులు పెద్ద ఎత్తున బైటాయించి ఉండగా, వెనుకవైపు ఉన్న గేటు ద్వారా వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. అక్కడ నుంచి కూడా ఎమ్మెల్యే సదస్సులోపలికి వెళ్లకుండా మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీతో పాటు నిర్వాసితులు అడ్డుతగిలారు. ఒకదశలో ఎమ్మెల్యే, నిర్వాసితులు మధ్య సంయమనం కోల్పోయి తోపులాటకు ఆస్కారం ఏర్పడింది. ఈలోగా కలెక్టర్ కెవి సత్యనారాయణ మెయిన్‌గేటు వద్దకు చేరుకోవడంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ సమన్యయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, నిర్వాసితులు కలెక్టర్ గోబ్యాక్....ఆర్డీఓ డౌన్‌డౌన్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీఓ నిర్లక్ష్యంపై నిర్వాసితులు మండిపడ్డారు. అరగంటకు పైగా వేచియున్న కలెక్టర్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈనేపధ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం వాయిదా పడింది. ఇక్కడికిక్కడే నిర్ణయం చెప్పలేమన్న ఏసీసీ ప్రతినిధులు.... భూనిర్వాసితులు డిమాండ్స్ విషయమై ఏసీసీ ప్రతినిధులు ఇక్కడికిక్కడే నిర్ణయం తీసుకోలేమని, బోర్డు మీటింగ్‌లో సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సిన అంశాన్ని తాము స్పష్టం చేయలేమని తేల్చి చెప్పారు. కలెక్టర్, ఆర్డీఓ వెనుతిరిగిన అనంతరం ఎట్టకేలకు ఎమ్మెల్యే ఆది ఏసీసీ ప్రతినిధులతో సమావేశమైయ్యారు. నిర్వాసితులకు మీరేమి చేయగలరో తెలియ చెప్పండని, కోరగా తాము ఏమి చెప్పలేమని బోర్డు నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పసాగారు. కాగా తాను హామీ ఇస్తున్నా...నిర్వాసితులకు పరిహారం ఇప్పించగలనని ఎమ్మెల్యే ఆది ప్రకటించడం విశేషం. కాగా నిర్వాసితులు కలిసికట్టుగా వ్యవహారాన్ని ఎదుర్కొవడం, వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు అండగా ఉండడంతో ఏసీసీ యాజమాన్యం, అధికార యంత్రాంగం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. -
ధర్మబద్ధంగా వ్యవహరించాలి
సత్తుపల్లి, న్యూస్‌లైన్: సింగరేణి ఓపెన్‌కాస్టు భూ నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం వర్తించేలా ప్రభుత్వం ధర్మబద్ధమైన ఆలోచన చేయాలని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి కోరారు. సత్తుపల్లిలో భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు ఆదివారం ఆరో రోజు ఆయన సంఘీభావం ప్రకటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడాలన్నారు. ఎవరి జేబులో సొమ్ము ఇవ్వటం లేదని.. లక్షకోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్లో భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారమెంత అని ప్రశ్నించారు. నిర్వాసిత కుటుంబాలు ఘోషిస్తూ శాపనార్ధాలు పెడుతున్నా.. భూమిని బలవంతంగా తీసుకునేందుకే హడావిడిగా జనరల్ అవార్డు పాస్‌చేసి డబ్బులు డిపాజిట్ చేయటం ఏమాత్రం న్యాయ సమ్మతం కాదన్నారు. ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్న మంత్రులు ప్రకటనలకు పరిమితం కాకుండా అవార్డు రద్దుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరిని మోసం చేయని వ్యక్తి ఒక్క రైతు మాత్రమేనన్నారు. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఒక్క బస్తా ఎక్కువ దిగుబడి వచ్చినా అమితంగా ఆనందపడతాడన్నారు. నలుగురికి అన్నంపెట్టి ఆహారభద్రత ఇస్తున్న రైతులను మోసంతో బయటకు పంపించటం దారుణమన్నారు. నిర్వాసితుల పరిహారం పెంపు ఘనత వైఎస్ఆర్దే.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చిన రూ.1.04 లక్షల పరిహారం సరిపోదని ఉద్యమిస్తే దాన్ని రూ.2.40 లక్షలకు పెంచి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. మానవతాదృక్పథం ఉన్న వ్యక్తులు అధికారంలో ఉంటే సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు నిర్వాసిత రైతుల పక్షాన ధర్మబద్ధంగా పోరాడేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. భూ నిర్వాసితుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని వారికి పునరావాసం చూపెట్టకుండా ఎలా జనరల్ అవార్డు చట్టబద్ధత అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భూ నిర్వాసితులకు సూచించారు. తాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో రైతు ప్రతినిధిగా, పాలకవర్గ సభ్యుడిగా ఉన్నందున డిమాండ్లను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైఎస్ఆర్సీపీ ఖమ్మంపార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల న్యాయపరమైన పోరాటానికి అ య్యే ఖర్చు భరించటానికి ముందుకు రావటం అభినందనీయమని నాగిరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందలపు సత్యనారాయణ, గోలి శ్రీనివాసరెడ్డి, కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, ఎస్కె మౌలాన, మందపాటి ప్రభాకర్‌రెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్కె మౌలాలి, తన్నీరు జమలయ్య పాల్గొన్నారు.