ధర్మబద్ధంగా వ్యవహరించాలి | Earth expats To the initiation of solidarity | Sakshi
Sakshi News home page

ధర్మబద్ధంగా వ్యవహరించాలి

Published Mon, Jan 6 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Earth expats To the initiation of solidarity

 సత్తుపల్లి, న్యూస్‌లైన్: సింగరేణి ఓపెన్‌కాస్టు భూ నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం వర్తించేలా ప్రభుత్వం ధర్మబద్ధమైన ఆలోచన చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి కోరారు. సత్తుపల్లిలో భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు ఆదివారం ఆరో రోజు ఆయన సంఘీభావం ప్రకటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడాలన్నారు.
 
 ఎవరి జేబులో సొమ్ము ఇవ్వటం లేదని.. లక్షకోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్‌లో భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారమెంత అని ప్రశ్నించారు. నిర్వాసిత కుటుంబాలు ఘోషిస్తూ శాపనార్ధాలు పెడుతున్నా.. భూమిని బలవంతంగా తీసుకునేందుకే హడావిడిగా జనరల్ అవార్డు పాస్‌చేసి డబ్బులు డిపాజిట్ చేయటం ఏమాత్రం న్యాయ సమ్మతం కాదన్నారు. ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్న మంత్రులు ప్రకటనలకు పరిమితం కాకుండా అవార్డు రద్దుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరిని మోసం చేయని వ్యక్తి ఒక్క రైతు మాత్రమేనన్నారు. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఒక్క బస్తా ఎక్కువ దిగుబడి వచ్చినా అమితంగా ఆనందపడతాడన్నారు. నలుగురికి అన్నంపెట్టి ఆహారభద్రత ఇస్తున్న రైతులను మోసంతో బయటకు పంపించటం దారుణమన్నారు.  
 
 నిర్వాసితుల పరిహారం పెంపు ఘనత వైఎస్‌ఆర్‌దే..
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం నిర్వాసిత రైతులకు ఇచ్చిన రూ.1.04 లక్షల పరిహారం సరిపోదని ఉద్యమిస్తే దాన్ని రూ.2.40 లక్షలకు పెంచి ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. మానవతాదృక్పథం ఉన్న వ్యక్తులు అధికారంలో ఉంటే సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయని చెప్పారు. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు నిర్వాసిత రైతుల పక్షాన ధర్మబద్ధంగా పోరాడేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. భూ నిర్వాసితుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని వారికి పునరావాసం చూపెట్టకుండా ఎలా జనరల్ అవార్డు చట్టబద్ధత అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భూ నిర్వాసితులకు సూచించారు. తాను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలో రైతు ప్రతినిధిగా, పాలకవర్గ సభ్యుడిగా ఉన్నందున డిమాండ్లను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఖమ్మంపార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల న్యాయపరమైన పోరాటానికి అ య్యే ఖర్చు భరించటానికి ముందుకు రావటం అభినందనీయమని నాగిరెడ్డి అన్నారు.
 
 ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందలపు సత్యనారాయణ, గోలి శ్రీనివాసరెడ్డి, కోటగిరి మురళీకృష్ణారావు, పాలకుర్తి యాకోబు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, ఎస్‌కె మౌలాన, మందపాటి ప్రభాకర్‌రెడ్డి, మలిరెడ్డి మురళీరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్‌కె మౌలాలి, తన్నీరు జమలయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement