బిజెపి అభ్యర్థిగా 'లింగం మావయ్య'
రాంగోపాల్ వర్మ మనీలో డబ్బాశ మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ కి లింగం మావయ్య బిజెపిలో చేరాడు. చేరడమే కాదు అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీ సీటుకు పోటీకి దిగనున్నాడు.యెస్... విలక్షణ నటుడు పరేశ్ రావల్ బిజెపి తరఫున బరిలోకి దిగుతున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పరేశ్ రావల్ గత ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేశారు. ఆయన నైపుణ్యాలను చూసిన మోడీ ఇప్పుడు ఆయనకు పెద్ద బాధ్యతే ఇచ్చారు.
పరేశ్ రావల్ కి నరేంద్ర మోడీకి మధ్య ఫ్రెండ్ షిప్ పెరగడానికి కారణం రావల్ భార్య, మాజీ మిస్ ఇండియా, నటి స్వరూప్ సంపత్. సంపత్ మానసిక వికలాంగ బాలబాలికల విద్యా బోధనలో పీహెచ్ డీ చేశారు. ఆమె ఆ రంగంలో సేవలందించడానికి తాను సిద్ధం అని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. దాంతో మోడీ ఆమెకు రాష్ట్ర విద్యాబోధన సంస్థలో బాధ్యతనిచ్చారు. ఆమె ద్వారా పరేశ్ రావల్ పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్యా దోస్తీ పెరిగింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ జీవితంపై ఒక ఎన్ ఆర్ ఐ సినిమా నిర్మిస్తున్నారు. అందులో మోడీ పాత్రను పరేశ్ రావల్ పోషిస్తున్నారు.