eastern states
-
భౌతిక దూరం లేదు..!
న్యూఢిల్లీ: హిల్ స్టేషన్లలో పర్యాటకులు, మార్కెట్లలో వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు,గుంపులుగా తిరుగుతుం డడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ధర్డ్ వేవ్‌ను విజయవంతంగా అడ్డుకోవాలంటే ప్రజలు నిర్లక్ష్యం వీడి, అత్యంత అప్రమత్తతతో ఉండాలని కోరారు. జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్‌ను అడ్డుకోగలుగుతామన్నారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మంగళవారం ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న కరోనా కట్టడి చర్యలపై వర్చువల్‌గా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని తెలిపారు. ‘భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లను ధరించడం, టీకా వేసుకోవడం ద్వారా నివారణ.. అనుమానితులను గుర్తించడం, పరీక్షలు జరపడం, వైద్యం అందించడం ద్వారా చికిత్స.. కరోనా కట్టడిలో ఇది విజయవంతమైన వ్యూహం’ అని వ్యాఖ్యానించారు. ‘కరోనాతో పర్యాటకం, వ్యాపారం దెబ్బతిన్నమాట వాస్తవమే కానీ.. హిల్ స్టేషన్లలో, మార్కెట్లలో ప్రజలు మాస్క్‌లు లేకుండా తిరగడం సరికాదు’ అని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ రావడానికి ముందే ఎంజాయ్ చేయాలనుకునే ధోరణిని ప్రధాని తప్పుబట్టారు. థర్డ్ వేవ్ దానికదే రాదని, మన నిర్లక్ష్యం వల్లనే వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ప్రధాని సీఎంలను కోరారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన సుమారు 23 వేల కోట్ల ప్యాకేజీతో ఈశాన్య ప్రాంతంలోనూ వైద్య వసతులను మరింత మెరుగుపర్చాలన్నారు. ఈ సమావేశంలో అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా, ప్రధాని ఈనెల 16న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ సీఎంలతో కోవిడ్‌పై సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. -
ఈశాన్యంలో ‘మిషన్ 20’ సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ నాగాలాండ్ ప్రభుత్వంలో జూనియర్ భాగస్వామి మాత్రమే. మిగతా ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ ఉనికి అంతంత మాత్రమే. ఐదేళ్లు తిరిగే సరికి అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగా, నాగాలాండ్, మేఘాలయ ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామి అవడం అనూహ్య పరిణామం. కేంద్రంలో ఉన్న పార్టీయే అధికారంలో ఉంటే అభివద్ధి ఎక్కువగా జరుగుతుందీ, అభివద్ధికి ఎక్కువగా నిధులు వస్తాయన్న నమ్మకం అనే ఒక్క కారణంగానే ఆ రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కట్టలేదు. ప్రధాన భూభాగంపై నెరపిన హిందూత్వ రాజకీయాలే ఎక్కడ కూడా పనిచేశాయి. హిందువులకు భారత దేశం తమ పురిటిగడ్డ అన్న విశ్వాసం ఎక్కువ. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో పలు జాతుల వారు క్రైస్తవులు అయినప్పటికీ తమ ప్రాంతం మీద మమకారం ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపించాలన్నది వారి వాదన. ఈ మనోభావాలను బాగా అర్థం చేసుకున్న బీజేపీ స్థానికంగా బలమైన జాతుల భాగస్వామ్యంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో విజయం సాధించగలిగింది. ఆ విజయాలచ్చిన ఊపుతో ఈశాన్య రాష్ట్రాల్లోని 25 లోక్‌సభ స్థానాలకుగాను కనీసం 20 సీట్లను సాధించాలనే లక్ష్యంతో ‘మిషన్ 20’ చేపట్టింది. ఒంటిరిగా వెళ్లితే అది సాధ్యమయ్యే పని కాదు. పైగా 2016లో పార్లమెంట్లో పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అది అసలు సాధ్యం కాదు. ఈ బిల్లును ఈ శాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు వల్ల అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో స్థిరపడిన ముస్లిం యేతర హిందువులు అందరికి పౌరసత్వం లభిస్తుందికనుక. ఈశాన్య ప్రజలు ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లింలే కాదు, హిందువులను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు రాజ్యసభలో నిలిచిపోవడం వల్ల పార్లమెంట్ ఆమోదం పొందలేక పోయింది. ఈ విషయాన్ని ఈశాన్య ప్రజలు కూడా దాదాపు మరచిపోయారు. బీజేపీ మొన్న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని పెట్టడం వల్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుయే కాకుండా అస్సాం సిటిజెన్ బిల్లు, స్థానిక పరిస్థితుల కారణంగా పలు ఈశాన్య రాష్ట్రాల్లో పలు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు బీజేపికి దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో వాటి మద్దతును కూడగట్టుకోకుండా ‘మిషన్–20’ బిజేపీకి సాధ్యమయ్యే పనికాదు. -
‘ఈశాన్యం’లో కాషాయం
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత కొన్ని మినహాయింపులతో ఆ పనిలో విజయవంతమవుతూనే ఉంది. కానీ సీపీఎం విషయంలో అలాంటి నినాదమేదీ ఇవ్వకుండానే త్రిపురలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని తుడిచిపెట్టింది. త్రిపురలో 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరగ్గా బీజేపీకి 35 లభించాయి. ఆ పార్టీ కూటమిలోని ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)కి వచ్చిన 8 సీట్లు లెక్కలోకి తీసుకుంటే కూటమి బలం 43 అవుతుంది. సుదీర్ఘకాలం నుంచి ఆ రాష్ట్రాన్నేలుతున్న సీపీఎం 16 సీట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. 60 సీట్లున్న మేఘాలయలో అత్యధి కంగా... అంటే 21 స్థానాలొచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించినా ఆ పార్టీకి అధి కారం దక్కకుండా చేయడంలో బీజేపీ కృతకృత్యమైంది. అక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) బీజేపీ ఆశీస్సులతో మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది. 60 స్థానాలున్న నాగాలాండ్‌లోనూ అదే పరిస్థితి. అక్కడ ఇంతవరకూ పాల కపక్షంగా ఉన్న నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు 27 స్థానాలు లభించి అతి పెద్ద పార్టీగా ఉన్నా 17 స్థానాలు వచ్చిన నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)యే 12 స్థానాలున్న బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది. ఎన్నికల ముందు బీజేపీ ఎన్పీఎఫ్తో ఉన్న పదిహేనేళ్ల చెలిమిని విడిచి ఎన్డీ పీపీతో జట్టు కట్టింది. తాజా ఎన్నికల తర్వాత ఈశాన్యంలో ఒక్క మిజోరం తప్ప మిగిలినచోట్ల కాంగ్రెస్ కనుమరుగైంది. క్రైస్తవ మత ప్రాబల్యం అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడటం, పైగా పాతికేళ్లుగా సీపీఎం ఏలు తున్న త్రిపురను సైతం తన ఖాతాలో వేసుకోవడం అసాధారణమే. త్రిపురలో ఇంతవరకూ ఒకే ఒక్క స్థానం ఉన్న బీజేపీకి ఒక్కసారిగా 35 స్థానాలు రావడం, ఆ పార్టీతో కలిసి పోటీచేసిన ఐపీఎఫ్‌టీకి 8 రావడం సాధారణ విషయం కాదు. అయితే ఓట్ల శాతం రీత్యా చూస్తే బీజేపీ, సీపీఎంల మధ్య పెద్ద తేడా లేదు. బీజేపీకి 43 శాతం ఓట్లు లభిస్తే సీపీఎంకు 42.7 శాతం వచ్చాయి. ఇన్నాళ్లనుంచీ సీపీఎంకు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని కోల్పో నట్టయితే బహుశా బీజేపీకి ఇక్కడ విజయం సాధ్యమయ్యేది కాదు. కానీ 2013లో 36.5శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 1.5 శాతానికి పడిపోయింది. 34 ఏళ్లపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన పశ్చిమబెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోయి ఏడేళ్లవుతోంది. దానికి త్రిపుర కూడా ఇప్పుడు తోడైంది. ఇక అయిదేళ్లకో సారి పాలక పక్షాన్ని మార్చే అలవాటున్న కేరళ మాత్రమే ప్రస్తుతం సీపీఎం నేతృ త్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) చేతిలో ఉంది. సుదీర్ఘకాలం అధికా రంలో ఉండటం ఏ పార్టీకైనా బలమూ, బలహీనత కూడా. బలం ఎందుకంటే– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో పార్టీ ప్రజలకు చేరువ కావొచ్చు. పలుకుబడిని పెంచుకోవచ్చు. సంస్థాగతంగా పటిష్టం కావొచ్చు. అయితే అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత గూడుకట్టుకుంటుంది. ధీమా ఏర్పడుతుంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో పైనున్న నాయకత్వానికి అందకుండా పోతుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వమూ, శ్రేణులూ కూడా నిరంతర జాగురూకతతో ఉంటారు. ఎక్కడేం జరుగుతున్నదో, దాన్ని అనుకూలంగా మలుచుకొనేందుకూ లేదా అధిగ మించేందుకూ చేయాల్సిందేమిటో నిరంతరం చర్చించుకునే ప్రక్రియ కొనసాగు తుంది. త్రిపురలో 2013 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటుతో, రెండు శాతంలోపు ఓట్లతో ఉన్న బీజేపీ ఈసారి సవాలు విసిరినప్పుడు సీపీఎం తేలిగ్గా తీసుకుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొ చ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ నిర్దిష్ట కార్యాచరణతో పనిచేస్తున్నదనీ, ముఖ్యంగా రెండేళ్లుగా వేలాదిమంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ అనుకూల వాతావరణం ఏర్ప డటానికి కృషి చేస్తున్నారని సీపీఎం శ్రేణులు సరిగా గుర్తించలేకపోయాయి. ముఖ్య మంత్రి మాణిక్ సర్కార్ వ్యక్తిగతంగా నిరాడంబరుడే కావొచ్చు... సొంతానికి ఇల్లు కూడా లేకపోవచ్చు... నిజాయతీతో కూడిన పాలన అందించి ఉండొచ్చు–కానీ రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పాతుకుపోయిన బెంగాలీ సంస్కృతి ఆధిపత్యంపై గిరి జనుల్లో గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో ఆ పార్టీ విఫలమైంది. త్రిపురలో 31శాతంమంది గిరిజనులు. వారిలో ఎక్కువమంది మాట్లాడే కోక్బోరాక్ భాష కాకుండా బెంగాలీయే అధికార భాషగా, బోధనాభాషగా చలామణి కావడం ఆ అసంతృప్తికి కారణం. రెండున్నర లక్షలమంది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి జీతాల విషయంలోనూ ఈ తరహా ఆగ్రహమే ఉంది. గత జూన్‌లో ప్రభుత్వం నాలుగో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిందిగానీ తాము అధికారంలోకొస్తే ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. అది అమలైతే ప్రభుత్వ సిబ్బందికి ఒక్కసారిగా రెట్టింపు వేతనం లభిస్తుంది. దీనికితోడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య కూడా సీపీఎంకు ప్రతికూలంగా మారింది. దేశంలో అత్య ధిక నిరుద్యోగం(19.7శాతం) త్రిపురలోనే ఉంది. 2016 జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం జాతీయ సగటు కంటే త్రిపురలో ఆత్మ హత్యల రేటు కూడా అధికమే. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. వాటినిబట్టే ఒక పార్టీ బలాన్ని లేదా బలహీనతల్ని లెక్కేయలేం. అయితే త్రిపురకూ, ఈశాన్య ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకూ తేడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు దాదాపుగా ఆయా ప్రాంతాల్లోని గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ త్రిపురలో కార్యకర్తలు పునాదిగా ఉన్న పార్టీ సీపీఎం. మళ్లీ ఆ స్థాయిలో శ్రేణులున్న బీజేపీ అడుగుపెడితే తప్ప సీపీఎంను ఓడించడం మరెవరికీ సాధ్యం కాలేదు. మొత్తానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న తీరు ఆ ప్రాంతం అభివృద్ధికి ఏ స్థాయిలో తోడ్పడగలదో వేచిచూడాలి. గొడ్డు మాంసం వంటి అంశాల్లో దేశంలో ఇతరచోట్ల ఉన్నట్టు ఈశాన్యంలో వ్యవహరిస్తే బీజేపీ వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఈ విజయంలోని పరిమితులేమిటో ఇతరుల కంటే బీజేపీకే ఎక్కువ తెలుసు. -
'మేఘాలయ మాదే.. అమ్మమ్మ దగ్గరకు వెళితే నేరమా?'
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపుర, నాగాలాండ్‌లో ఓటమిని అంగీకరించింది. ఓటమిగల కారణాలపై విశ్లేషించి పార్టీని మరింత బలంగా పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ అన్నారు. గతంలో నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకోగా ఈసారి కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఒక త్రిపుర గతంలో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇక్కడ కూడా ఖాతా తెరవలేకపోయింది. అయితే, మేఘాలయలో మాత్రం 2013లో 28 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి మాత్రం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస తరుపున అహ్మద్‌పటేల్ అధికారిక ప్రకటన చేశారు. 'మేఘాలయలో మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. త్రిపుర, నాగాలాండ్‌లో మాత్రం ఓడిపోయాం' అని ఆయన అన్నారు. ఇక ఓ పక్క ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే రాహుల్ గాంధీ విదేశాలకు వెళతారా అని బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన విమర్శలపై అహ్మద్‌పటేల్ స్పందించారు. ఆయన అనవసరంగా మాట్లాడుతున్నారని, ఎవరైనా వారి అమ్మమ్మ దగ్గరకు వెళితే నేరం అవుతుందా అని ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం గిరిరాజ్ ప్రవృత్తిని బయటపెట్టుకోవడం తప్ప మరొకటి కాదని ఆయన ప్రతిదాడి చేశారు. -
చైనాను 'ఆకాశ్'తో అడ్డుకుందామంటే..
న్యూఢిల్లీ: చైనా నుంచి ఎప్పుడైనా రక్షణ పరంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈశాన్య రాష్ట్రాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణులను మోహరించాలని భారత ప్రభుత్వం గతంలోనే భావించింది. అవును. తాజా కాగ్ రిపోర్టు ఈ విషయాన్నే వెల్లడించింది. ఇందుకోసం 2010లో కేబినేట్ ఆమోదాన్ని కూడా తెలిపింది. అయితే, ఇప్పటివరకూ ఈ దిశగా ముందడుగు పడకపోవడానికి కారణాలు తెలుసుకుంటే షాక్‌కు గురి కావాల్సిందే. ఆకాశ్ క్షిపణుల తయారీ నెలకొన్న లోపాల గురించి కాగ్ శుక్రవారం పార్లమెంటులో రిపోర్టు ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో ఆన్లైన్లో కూడా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆకాశ్ క్షిపణులను డీఆర్డీవో డిజైన్ చేసింది. ప్రభుత్వ సంస్ధలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) తదితరులు వీటిని ఉత్పత్తి చేశాయి. స్వదేశీ సాంకేతికతతో ఉత్పత్తైన ఆకాశ్ క్షిపణుల్లో మూడిండ ఒక వంతు ప్రయోగ దశలో విఫలమయ్యాయి. దీంతో అత్యవసర సమయాల్లో 'ఆకాశ్' ఆదుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తినట్లు కాగ్ పేర్కొంది. 2013 జూన్ నుంచి 2015 డిసెంబర్ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు ప్రదేశాల్లో చైనా వైపుగా ఆకాశ్ క్షిపణుల స్క్వాడ్రన్లను ఏర్పాటు చేయాల్సివుందని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,619 కోట్లు కేటాయించిందని వెల్లడించింది. అయితే, ఇప్పటివరకూ ఒక్క స్క్వాడ్రన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంది. బేస్‌ల నిర్మాణంలో జాప్యమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఆకాశ్ క్షిపణుల బేస్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే చైనా కొంచెం వెనక్కు తగ్గేదని సీనియర్ మిలటరీ అధికారులు చెబుతున్నారు.