చైనాను 'ఆకాశ్'తో అడ్డుకుందామంటే..
న్యూఢిల్లీ: చైనా నుంచి ఎప్పుడైనా రక్షణ పరంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈశాన్య రాష్ట్రాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణులను మోహరించాలని భారత ప్రభుత్వం గతంలోనే భావించింది. అవును. తాజా కాగ్ రిపోర్టు ఈ విషయాన్నే వెల్లడించింది. ఇందుకోసం 2010లో కేబినేట్ ఆమోదాన్ని కూడా తెలిపింది. అయితే, ఇప్పటివరకూ ఈ దిశగా ముందడుగు పడకపోవడానికి కారణాలు తెలుసుకుంటే షాక్‌కు గురి కావాల్సిందే.
ఆకాశ్ క్షిపణుల తయారీ నెలకొన్న లోపాల గురించి కాగ్ శుక్రవారం పార్లమెంటులో రిపోర్టు ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో కూడా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆకాశ్ క్షిపణులను డీఆర్‌డీవో డిజైన్ చేసింది. ప్రభుత్వ సంస్ధలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) తదితరులు వీటిని ఉత్పత్తి చేశాయి.
స్వదేశీ సాంకేతికతతో ఉత్పత్తైన ఆకాశ్ క్షిపణుల్లో మూడిండ ఒక వంతు ప్రయోగ దశలో విఫలమయ్యాయి. దీంతో అత్యవసర సమయాల్లో 'ఆకాశ్' ఆదుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తినట్లు కాగ్ పేర్కొంది. 2013 జూన్ నుంచి 2015 డిసెంబర్ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు ప్రదేశాల్లో చైనా వైపుగా ఆకాశ్ క్షిపణుల స్క్వాడ్రన్‌లను ఏర్పాటు చేయాల్సివుందని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3,619 కోట్లు కేటాయించిందని వెల్లడించింది.
అయితే, ఇప్పటివరకూ ఒక్క స్క్వాడ్రన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొంది. బేస్‌ల నిర్మాణంలో జాప్యమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఆకాశ్ క్షిపణుల బేస్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే చైనా కొంచెం వెనక్కు తగ్గేదని సీనియర్ మిలటరీ అధికారులు చెబుతున్నారు.