మహిళ మృతి కేసులో భర్త, అత్త, ఆడబిడ్డకు పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, మహిళ మరణానికి కారకులైన నేరం రుజు వు కావడంతో చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన నేరస్తులు మ్యాదర రమేష్(భర్త), మ్యాద ర సౌందర్య(అత్త), పోతుల వసంత(ఆడబిడ్డ)కు పదేళ్ల జైలుశిక్ష, రూ.8000 చొప్పున జరిమానా విధి స్తూ సోమవారం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం..
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాల్వ నర్సయ్య కూతురు సుకన్యకు మ్యాదర రమేష్‌తో 2013 జూన్ 2న వివాహమైంది. పెళ్లి సమయంలో రమేష్‌కు రూ.1.30 లక్షల నగదు, బంగారం వస్తు సామగ్రి కట్నకానుకలుగా ఒప్పుకున్నారు. అందులో రూ.50 వేలు తర్వాత ఇస్తామని చెప్పారు.కొద్దికాలం ఇరువురు బాగానే ఉన్నారు. తర్వాత ఇవ్వాల్సిన రూ.50 వేలతోపాటు అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు, ఆడబిడ్డలు సుకన్యను వేధించసాగారు. ఈ క్రమం లో 2015 జూలై1న అపస్మారక స్థితిలో ఉన్న సుకన్యను అంబులెన్ స ద్వారా చిట్యాల దవాఖానకు తీసుకొచ్చారు. అప్పటికే సుకన్య మృతిచెందిందని డాక్టర్ తెలిపారు. అత్తారింటి వారే వేధించి విషమిచ్చి తన కూతురిని చంపారని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో సుకన్య మరణానికి కారణం భర్త రమేష్, అత్త సౌందర్య, ఆడబిడ్డ వసంతేనని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో ఐపీసీ సెక్షన్ 304 (బి) కింద నేరస్తులకు పది సంవత్సరాల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమాన విధిస్తూ తీర్పును జడ్జి నర్సిం హులు వెల్లడించారు. అలాగే వివాహితను వేధింపులకు గురిచేసినందున ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద మూడేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమాన, కట్నం కోసం పీడించినందుకుగాను వరకట్న నిరోధక చట్టం సెక్షన్ 3 కింద ఆరు మాసాల జైలుశిక్ష, రూ.500 చొప్పున జరిమాన విధించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని, గతంలో గడిపిన జైలుశిక్ష కాలాన్ని మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును ప్రాసిక్యూషన్ తరఫున పీపీ విజయాదేవి వాదించగా లైజన్ ఆఫీసర్ వి.భద్రునాయక్ విచారణ పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుల్ ఎం.సుభాష్ కోర్టులో ప్రవేశపెట్టారు.