రాజన్న రాజ్యం కోసం.. మీ ముందుకు వస్తున్నా
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రాజన్న రాజ్యాన్ని తిరిగి ప్రజలకందించడానికే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థి ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. తన సొంతగ్రామం ఆదిబట్ల నుంచి ఆయన శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను సెంటిమెంట్‌గా భావించే గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భూపతిగళ్ల వెంకటయ్య అనే దళితుడి గడపను కడిగి బొట్టుపెట్టారు. గ్రామంలోని టీడీపీ, కాంగ్రెస్, బీజీపీతో సహా అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా కదలిరాగా భూపతిగళ్ల వెంకటయ్య ఇంటివద్ద కొబ్బరికాయలు కొట్టి శేఖర్‌గౌడ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించారు. తన కుటుంబం మీద అభిమానంతో, నమ్మకంతో తన తండ్రి రామచంద్రయ్యను, తనను పలు పర్యాయాలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నందకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిబట్లలో పుట్టిన బిడ్డగా ఈ గ్రామ ప్రజలందరూ తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని శేఖర్‌గౌడ్ కోరారు.
రాజన్నను అభిమానించే వ్యక్తిగా..
రాజకీయంగా ఎంతో అనుభవమున్న తాను ఆది నుంచి రాజశేఖరరెడ్డిని అభిమానించే వ్యక్తినన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిపొందిన వారు వైఎస్‌ను దేవుడిగా భావించారన్నారు. ఆరోగ్యశ్రీ, రైతాంగానికి ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలు రూపొందించి వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి పాలన పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి కలల్ని సాకారం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీని స్థాపించారన్నారు.
రాజన్న రాజ్యం కోసం జగనన్నతో కలిసి ప్రజల్లోకి వస్తున్నానని.. ఈ ప్రాంత ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీలు ఏ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పనిచేయలేదని.. పదవుల కోసమే వారు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే తాము మరింత వెనకబాటుకు గురువుతామని.. ప్రజలు ఆలోచించి వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని శేఖర్‌గౌడ్ కోరారు. తదనంతరం కొంగరకలాన్, బొంగ్లూర్‌లో శేఖర్‌గౌడ్ ప్రచారం చేశారు. శేఖర్‌గౌడ్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు నాయిని సుదర్శన్‌రెడ్డి, మంచిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ పల్లె సాయిబాబగౌడ్, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ చిత్రం జంగయ్య, పలు ఇతర పార్టీలకు చెందిన నాయకులు గ్రామ సర్పంచ్ భూపతిగళ్ల రాజు, బూరుగు వెంకట్‌రెడ్డి, పల్లె శ్రీనివాస్‌గౌడ్, పల్లె నరేందర్‌గౌడ్, రాజు తదితరులు శేఖర్‌గౌడ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.