యాచారం, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోందని, ఇది తెలంగాణ ప్రజల సమష్టి విజయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, యువత బలిదానాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజనకు నిర్ణయం తీసుకుందని, పార్లమెంటులో బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి కూడా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ అప్పట్లోనే రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపించడంలో వైఎస్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయపక్షాలు కృషి చేయాల్సి ఉందని, ఈ విషయంలో వైఎస్సార్ సీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని, పార్టీ ఆశయాలు... ప్రణాళికలను వివరించి ప్రజల మద్దతు కూడగడతామన్నారు.
ఇబ్రహీంపట్నం డివిజన్‌కు సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. మూడేళ్ల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసి బోరుబావుల్లో నీళ్లున్నా విద్యుత్ కోతలతో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో గంట కోత విధించడం, నాణ్యత లేని కరెంటుతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నాణ్యమైన ఏడు గంటల విద్యుత్ ఇవ్వకుంటే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అంతకుముందు ఈసీ శేఖర్‌గౌడ్ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు, నందివనపర్తి సర్పంచ్ రాజునాయక్ చెల్లెలు విజయ, సూర్యల వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో యాచారం సర్పంచ్ మారోజ్ కళమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్‌రెడ్డి, మండల కన్వీనర్ మోతీరాంనాయక్, నాయకులు రెడ్డి వెంకట్‌రెడ్డి, దార నర్సింహ, నస్దిక్‌సింగారం ఉప సర్పంచ్ చింతపల్లి వరప్రసాద్‌రెడ్డి, మారోజ్ శ్రీనువాస్, ప్రశాంత్‌రెడ్డి, భూపతిరెడ్డి, బుచ్చానాయక్ తదితరులు ఉన్నారు.
‘ప్రత్యేకం’ తెలంగాణ ప్రజల విజయం
Published Wed, Feb 19 2014 11:37 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement