లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ స్థానం బీఎస్‌పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు.
ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్‌నగర్‌లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్‌పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment