2018 అసెంబ్లీ ఎన్నికలు. లెఫ్ట్ కూటమి పాతికేళ్ల పాలనతో విసిగిపోయిన త్రిపుర ప్రజలను బీజేపీ అభివృద్ధి మంత్రం ఆకట్టుకుంది. దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్‌టీకి గిరిజనుల్లో ఉన్న ఆదరణ తోడైంది. దాంతో 60 సీట్లకు గాను కాషాయ పార్టీ ఏకంగా 36 స్థానాల్లో నెగ్గింది. ముఖ్యంగా 20 ఎస్టీ స్థానాల్లో ఏకంగా 17 సీట్లను కొల్లగొట్టింది! ఐదేళ్ల తర్వాత పరిస్థితులు తారుమారవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో రాజకీయ పార్టీ అవతారమెత్తిన ఉద్యమ సంస్థ టిప్రా మోతా ఈసారి అధికార పార్టీ పుట్టి ముంచేలా కన్పిస్తోంది...
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. పోలింగ్ (ఫిబ్రవరి 16) తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ అమ్ములపొదుల్లోంచి అన్ని అస్త్రాలూ బయటికి తీస్తున్నాయి. రాష్ట్రంలో పాతికేళ్ల లెఫ్ట్ పాలనకు 2018 ఎన్నికల్లో బీజేపీ తెర దించింది. గిరిజనుల్లో బాగా పట్టున్న ఐపీఎఫ్‌టీ పార్టీతో జట్టు కట్టి ఘనవిజయం సాధించింది. సీపీఎం 16 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ సోదిలోకూడా లేకుండా పోయింది. ఈసారి మాత్రం టిప్రా మోతా రూపంలో కొత్త పార్టీ తెరపైకి రావడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి.
పరిస్థితి తారుమారు...
త్రిపుర మాజీ రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ బిక్రం మాణిక్యదేబ్ బర్మన్ సారథ్యంలో కొంతకాలంగా ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోసం పోరాడుతున్న తిప్రా (త్రిపుర ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్) మోతా ఈసారి పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే రంగంలోకి దిగి పోటీని ముక్కోణంగా మార్చేసింది. అధికార బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతోంది. మూలవాసులైన గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ తిప్రాలాండ్‌ను సాధిస్తామన్న మోతా హామీ ఎస్టీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా గత ఎన్నికల్లో ఐపీఎఫ్‌టీతో పొత్తు ద్వారా బీజేపీ కొల్లగొట్టిన గిరిజన ఓట్లు ఈసారి చాలావరకు మోతావైపు మళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. గిరిజనుల్లోని లెఫ్ట్ ఓటు బ్యాంకుకూ మోతా గండి కొట్టేలా ఉంది. త్రిపురలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 20 వారికి రిజర్వయ్యాయి. అంతేగాక మరో 23 గిరిజనేత స్థానాల్లోనూ 10 శాతానికి పైగా ఉన్న ఎస్టీలు అక్కడా నిర్ణయాత్మకంగానే ఉన్నారు. 2018లో బీజేపీ కూటమి 20 ఎస్టీ సీట్లలో ఏకంగా 17 స్థానాలను దక్కించుకుంది!
అలా బీజేపీ కూటమికి అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన గిరిజన ఓట్లరు ఈసారి టిప్రా మోతాకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీట్లలో ముఖ్యంగా గిరిజనులు 60 శాతానికి పైగా ఉన్న 12 చోట్ల మోతాకు విజయావకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. 50–60 శాతం మధ్య ఉన్న 5 స్థానాల్లో మోతా గట్టి పోటీ ఇవ్వనుండగా 50 శాతాం కంటే తక్కువగా ఉన్న మిగతా మూడు చోట్ల ముక్కోణ పోరు జరిగేలా కన్పిస్తోంది.
ఎలా చూసినా బీజేపీ కూటమికి ఈ 20 సీట్లలో ఈసారి రెండు మూడు సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా. దీనికి తోడు గిరిజన ప్రాబల్యమున్న 23 గిరిజనేతర అసెంబ్లీ స్థానాల్లో కూడా మోతా ఏకంగా 22 చోట్ల పోటీకి దిగడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ కూటమి 12 నుంచి 15 సీట్లు కోల్పోయి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా. 10 నుంచి 15 సీట్లు గెలిచేలా కన్పిస్తున్న మోతా కింగ్‌మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు.
ఓట్ల చీలికపైనే లెఫ్ట్ ఆశలు
గత ఎన్నికలఓల 42 శాతానికి పైగా ఓట్లు సాధించినా సీట్ల లెక్కలో వెనకబడ్డ సీపీఎం, ఈసారి ఓట్ల చీలికపై బాగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ–ఐపీఎఫ్‌టీ కూటమిని ఓడించేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. 20 గిరిజన సీట్లతో పాటు 22 గిరిజనేతర స్థానాల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు మోతా గండికొట్టనుండటం సీపీఎం–కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చేలా కన్పిస్తోంది. దీనికి తోడు 2.5 లక్షల ఉద్యోగాలు తదితర హామీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటర్లలో చాలామంది పొత్తును గౌరవించి సీపీఎం అభ్యర్థులకు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఏడు దశాబ్దాల వైరాన్ని, అధికారంలో ఉండగా తమపట్ల సీపీఎం అనుసరించిన అణచివేత ధోరణిని మర్చిపోలేమని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ముస్లింల్లో అత్యధికులు లెఫ్ట్ వైపే మొగ్గుతున్నారు.
బీజేపీ.. అభివృద్ధి మంత్రం
2018లో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని జనం నమ్మడంతో ఆ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లు సాధించింది! ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్న అసంతృప్తి జనాల్లో ఉంది. శాంతిభద్రతలు క్షీణించాయన్నది మరో పెద్ద ఆరోపణ.అయితే మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూస్తామంటున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. పీఎం ఆవాస్ యోజన మొదలుకుని కిసాన్ సమ్మాన్ నిధి దాకా పలు కేంద్ర పథకాల లబ్ధిదారులు ఎక్కువగానే ఉన్నారు. వీరిలోనూ మహిళల సంఖ్య ఎక్కువ. వారు మళ్లీ బీజేపీకే ఓటేస్తామంటున్నారు.
పైగా సీఎం మాణిక్ సాహాకు ప్రజల్లో మంచి పేరుంది. కానీ 9 నెలల క్రితం దాకా సీఎంగా ఉన్న బిప్లబ్ దేబ్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత బీజేపీకి నష్టం చేసేలా కన్పిస్తోంది. పైగా 2018లో గిరిజనుల్లో మంచి ఆదరణతో 8 సీట్లు సాధించిన భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్‌టీ ఆ తర్వాత అధ్యక్షుడు ఎన్.సి.దేబ్‌బర్మ మృతితో బాగా బలహీనపడింది. దాంతో బీజేపీ ఈసారి ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని వాటిపై భారీ ప్రచారంతో హోరెత్తిస్తోంది.
రాష్ట్రమంతటా కాషాయ జెండాలే ఎగురుతున్నాయి! ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ కార్యాలయాలు తెరిచి తమ నేతలు, కార్యకర్తలను ఓటర్లతో నిత్యం టచ్‌తో ఉంచుతూ అధికార పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతోంది. హిందువుల్లో అత్యధికులైన బెంగాలీలు, ఎస్టీల్లో ఎగువ కులాల వారు బీజేపీ వైపే మొగ్గుతున్నారు. ఇక గిరిజన స్థానాల్లోని బెంగాలీలు బీజేపీకి, ముస్లింలు సీపీఎంకు జై కొడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment